ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. గంటల వ్యవధిలోనే భారీ వైమానిక, క్షిపణిలతో టెహ్రాన్ మీద యుఎస్ మిలిటరీ దాడులు
పశ్చిమ ఆసియాలో శాంతి ఆశలు కల్పిస్తూ కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఒక్కసారిగా ముక్కలైంది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన 'అపాచీ' దాడి హెలికాప్టర్‌ను టెహ్రాన్ (ఇరాన్) కూల్చివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించిన కొద్ది గంటల్లోనే.. అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ వైమానిక, క్షిపణి దాడులను ప్రారంభించింది. ఈ ఆకస్మిక దాడి ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలకు గట్టి ప్రతిఘటన ఇచ్చింది.
ఈ ప్రతికార చర్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ఇరాన్ చర్యకు మా ప్రతిస్పందన చాలా బలంగా, అత్యంత శక్తివంతంగా ఉండాలని నేను గట్టిగా నమ్మాను, ఈ దాడులు కూడా సరిగ్గా అలాంటివేనని వ్యాఖ్యానించారు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌కు చెందిన ఒక వన్-వే అటాక్ (ఆత్మాహుతి) డ్రోన్ దాడి వల్లే అమెరికా అపాచీ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే, హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను అమెరికా నావికాదళానికి చెందిన ఒక ఉపరితల డ్రోన్ సముద్రం నుండి సురక్షితంగా రక్షించిందని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సైనిక వర్గాలు తెలిపాయి.

వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడిన ట్రంప్.. పైలట్లు క్షేమంగా ఉన్నందున హెలికాప్టర్ ఘటన 'పెద్ద విషయం కాదని' ఒకవైపు చెబుతూనే, మరోవైపు ఇరాన్ రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడటం గమనార్హం. ఈ దాడుల తీవ్రతను ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధృవీకరించింది. హార్ముజ్ జలసంధిలోని అత్యంత కీలకమైన ఖేష్మ్ ద్వీపంతో పాటు, సిరిక్ ఓడరేవు నగరంపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడిందని ఇరాన్ పేర్కొంది.
అలాగే సమీపంలోని బందర్ అబ్బాస్, జలసంధి ప్రవేశ ద్వారమైన జాస్క్ కౌంటీ పరిసరాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక నివాసితులు తెలిపారు. హార్ముజ్ జలసంధి చుట్టూ అమర్చిన అనేక ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు (Air Defence Systems), రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అమెరికా సైనిక కేంద్ర కమాండ్ ఈ మిషన్‌ను "ఇరాన్ యొక్క అన్యాయమైన దురాక్రమణకు అనుపాత ప్రతిస్పందన" గా అభివర్ణించింది.
అమెరికా దాడుల అనంతరం ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, తమ దేశంపై జరిగిన ఏ దాడిని లేదా బెదిరింపును అయినా జవాబు లేకుండా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని విదేశీ బలగాలు (అమెరికా సైన్యం) ప్రమాదాలు లేదా ఎదురుకాల్పుల్లో చిక్కుకునే అవకాశం ఉందని, అలాంటి ముప్పులను తగ్గించుకోవాలంటే వాళ్ళు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవడమే ఉత్తమ పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గత 24 గంటల్లో ఎలాంటి దాడులు జరగలేదని ఇరాన్ సైనిక మూలాలు కొన్ని నివేదించినప్పటికీ, శత్రువు మళ్లీ తమను రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించాయి.
మరోవైపు, పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ చర్యలు కూడా అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాపై పోరాటాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ నిరాకరిస్తోంది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంతో సంబంధం లేకుండా, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని చారిత్రాత్మక ఓడరేవు పట్టణమైన టైర్‌పై జరిపిన ఘోరమైన వైమానిక దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించారు.
మార్చిలో హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించినప్పటి నుండి లెబనాన్‌పై జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదే కావడం గమనార్హం. ఇటు ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్ సరిహద్దు సమీపంలోని రామిమ్ రిడ్జ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒకరు మరణించారు. వాషింగ్టన్‌తో కుదిరే ఏ శాంతి ఒప్పందమైనా లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల ముగింపుతో ముడిపడి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
ఈ తాజా సైనిక ఘర్షణల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్యం పునఃప్రారంభం కావడం మరింత ఆలస్యం కానుంది. యుద్ధానికి ముందు ప్రపంచంలోని ముడి చమురు మరియు ద్రవీకృత సహజ వాయువులో (LNG) ఐదో వంతు ఈ మార్గం గుండానే రవాణా అయ్యేది. ప్రస్తుతం ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించగా, అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు విధించింది.
అయితే, హార్ముజ్ గుండా నౌకా రవాణా క్రమంగా పెరుగుతోందని, కానీ ఇంధన సరఫరా సాధారణ స్థితికి రావడానికి చాలా నెలలు పడుతుందని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు. భవిష్యత్తులో ఇరాన్‌తో కుదిరే ఏ శాంతి ఒప్పందమైనా ఆ దేశం అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకునేలా ఉండాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా, తమపై అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయాలని, స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది.


Click it and Unblock the Notifications
