Accenture News: ఐటీ కంపెనీలపై బాంబు పేల్చిన యాక్సెంచర్.. కుప్పకూలుతున్న స్టాక్స్..!
Accenture Forecast: అగ్రగామి ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న యాక్సెంచర్ తాజాగా వృద్ధి అంచనాలను ప్రకటించింది. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీలపై పెద్ద పిడుగులాగా మారింది.
యూఎస్ ఆధారిత టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఆర్థిక అనిశ్చితి కారణంగా 2024 ఆర్థిక సంవత్సరానికి తన రాబడి అంచనాను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరణ ఫలితంగా ప్రీమార్కెట్ ట్రేడింగ్ షేర్లలో 5.6% క్షీణత ఏర్పడింది. గతంలో 2024 కాలానికి కంపెనీ తన వృద్ధిని 2-5 శాతంగా అంచనా వేయగా.. ప్రస్తుతం దానిని 1-3 శాతం మధ్యకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఆర్థిక అనిశ్చితులతో క్లయింట్లు కన్సల్టింగ్ సేవలపై ఖర్చులను తగ్గించే సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య తాజా గ్రోత్ అంచనాల సర్దుబాటు నెలకొంది.

ప్రస్తుతం యాక్సెంచర్ ఐటీ- కన్సల్టింగ్ సేవల్లో దిగజారిన డిమాండ్ తో పోరాడుతోంది. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను కొనసాగించటంతో తీవ్రమైన పరిస్థితులను చూస్తున్నాయి. టెక్ పరిశ్రమలో డీల్స్ మందగించటంతో యాక్సెంచర్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఉద్యోగులకు తొలగింపుల పరిహారం ఈ ఏడాది 450 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. గత ఏడాదిలో ఇది 1.1 బిలియన్ డాలర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కంపెనీ దాదాపు 19,000 మంది ఉద్యోగులను తగ్గించింది.
ఇక దేశీయ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నిరుత్సాహమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు వెచ్చిస్తున్న ఖర్చులో తిరోగమనాన్ని ప్రతిబింబిస్తుంది. గత ఆరు త్రైమాసికాలుగా పరిశ్రమ వృద్ధి క్షీణిస్తున్నట్లు బైర్డ్ ఈక్విటీ విశ్లేషకులు గుర్తించారు. యాక్సెంచర్ మళ్లీ బలమైన వృద్ధి బాట పట్టేందుకు కొన్ని సంవత్సరాలు అవసరమయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇతర భారతీయ టెక్ కంపెనీల పరిస్థితులు కూడా కష్టతరంగానే కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ప్రఖ్యాత టెక్ కంపెనీల భవిష్యత్తు ఆర్డర్ బుక్ చాలా వీక్ గ్రోత్ కలిగి ఉన్నాయి. యాక్సెంచర్ కొత్త బుకింగ్‌లు రెండవ త్రైమాసికానికి 2% క్షీణించి 21.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కమ్యూనికేషన్స్, మీడియా & టెక్నాలజీ విభాగం నుంచి వచ్చే ఆదాయం సంవత్సరానికి 8% తగ్గింది. యాక్సెంచర్ నివేదించబడిన 15.80 బిలియన్ డాలర్ల ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే కొంచెం తక్కువగా ఉంది. యాక్సెంచర్ ఆదాయలు దేశీయ టెక్ కంపెనీలకు కీలక మార్గనిర్థేశకంగా మారనున్నాయి.


Click it and Unblock the Notifications