ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్ వేదికగా చేసిన ప్రకటన మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత పెంచింది. ఇరాన్ అణ్వాయుధాన్ని సాధించకుండా నిరోధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ట్రంప్.. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై సైనిక చర్యను అత్యంత తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
ఒకవేళ టెహ్రాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోయినా లేదా ప్రతిపాదిత ఒప్పందాన్ని అంగీకరించకపోయినా, ఆ దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఏకకాలంలో దాడులు చేస్తామని, తద్వారా ఇరాన్‌ను తిరిగి రాతియుగానికి పంపిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీశామని పేర్కొన్న ట్రంప్, త్వరలోనే అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ యుద్ధ వ్యూహం కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా, ప్రపంచ ఇంధన సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా చేపట్టబోదని ట్రంప్ ఖరాకండిగా చెప్పారు.
ఆ మార్గంపై ఆధారపడే దేశాలే తమ సొంత ఖర్చుతో, బాధ్యతతో భద్రతను చూసుకోవాలని, లేనిపక్షంలో అమెరికా నుండి నేరుగా చమురు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఇది ముఖ్యంగా ఆసియా దేశాలకు పెద్ద సవాలుగా మారనుంది. ఒకవైపు సైనిక దళాల ఉపసంహరణ గురించి మాట్లాడుతూనే.. మరోవైపు దాడుల తీవ్రతను పెంచుతామనడం ట్రంప్ ద్వంద్వ వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది.
ట్రంప్ ప్రసంగం వెలువడిన వెంటనే దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగితే చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందనే ఆందోళనతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో పెట్టుబడిదారుల ఆందోళన కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ 1శాతం మేర పడిపోయాయి.
ఇరాన్ మాత్రం అమెరికా చేస్తున్న చర్చల వాదనలను కొట్టిపారేస్తూ.. ఏప్రిల్ 6 గడువును తాము లెక్కచేయడం లేదని తన అధికారిక మీడియా ద్వారా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతలు రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు శాంతి భద్రతలను ఏ తీరానికి చేరుస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications