ఇరాన్‌కు అమెరికా షాక్.. రెండు ప్రభుత్వ ట్యాంకర్లపై దాడి.. అమెరికా స్థావరాలపై టెహ్రాన్ ఎదురుదాడి..
US-Iran War Escalates: గత కొన్ని నెలలుగా తాత్కాలిక సడలింపులతో కొనసాగుతున్న అమెరికా- ఇరాన్ మధ్య సైనిక పోరు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. పశ్చిమ ఆసియాలో శాంతి యత్నాలు విఫలమవడంతో పాటు, వ్యూహాత్మకంగా కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మార్గంలో దాడులు పెరగడంతో మంగళవారం నుంచి ఇరు దేశాల మధ్య మళ్లీ బాంబుల వర్షం కురుస్తోంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న సైనిక రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలే లక్ష్యంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) విరుచుకుపడింది.
అమెరికా దాడులకు ప్రతికారంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా వెంటనే ప్రతీకార దాడులు ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్‌లోని యుఎస్ సైనిక స్థావరాలను, దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుసగా ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌ల దాడికి దిగింది. జోర్డాన్, కువైట్, ఇరాక్ (ఎర్బిల్), బహ్రెయిన్ సరిహద్దులలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగిందని స్థానిక మీడియా ధ్రువీకరించింది.

ప్రపంచ ముడిచమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు ఇరాన్ యత్నిస్తుండగా, దాన్ని పునరుద్ధరించేందుకు యుఎస్ నౌకాదళం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వాణిజ్య చమురు ట్యాంకర్లపై ఇరాన్ విరుచుకుపడటంతో ప్రతిస్పందనగా యుఎస్ ఈ నూతన దాడుల సిరీస్‌ను మొదలుపెట్టింది. వైట్ హౌస్ నుండి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, "హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం అమెరికా పూర్తి నియంత్రణలో ఉందన్నారు. ఒకవేళ ఇరాన్ గనక మళ్లీ విరుచుకుపడితే, మునుపెన్నడూ చూడని రీతిలో ఊహించని నష్టం చవిచూడాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
అయితే ఇరాన్ మాత్రం తాము లొంగేదే లేదని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ, అమెరికా కేవలం షరతులు విధించడమే చర్చలుగా భావిస్తోందని, నిరంతరం ఆర్థిక, రక్షణ దిగ్బంధం విధిస్తే సైనిక మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇరాన్ దాడిలో అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం జరగలేదని, అత్యధిక క్షిపణులను ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా గాలిలోనే ధ్వంసం చేశామని యుఎస్ రక్షణ వర్గాలు ప్రకటించాయి.
ఈ పరస్పర దాడుల మధ్య ఇరాన్‌లోని దక్షిణ కొహెస్తాక్ (Kuhestak) ప్రాంతంలో ఒక అమెరికా క్షిపణి శకలాలు నివాస గృహాలపై పడటంతో ఒక వివాహ వేడుక తీవ్ర విషాదాంతమైంది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా నలుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఈ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలపై స్పష్టంగా కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు ఏకంగా 92 డాలర్లు దాటి పరుగులు తీస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లను ద్రవ్యోల్బణ భయాలు కమ్మేశాయి. భారత్ వంటి ఇంధన దిగుమతి ఆధారిత దేశాల స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమవ్వగా.. గోల్డ్ మార్కెట్‌లోనూ తీవ్ర అస్థిరత నెలకొంది. ఐక్యరాజ్యసమితి, అరబ్ దేశాలు ఇరు వర్గాలూ వెంటనే యుద్ద విరమణ ప్రకటించి, చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.


Click it and Unblock the Notifications
