ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..
పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాలైన 'నాటో' (NATO) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు.. ఇరాన్‌పై సైనిక చర్యలో తమతో కలిసి రావాలని ట్రంప్ ఇచ్చిన పిలుపునకు నాటో దేశాలు స్పందించకపోవడం ఈ ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా స్పందించిన ఆయన.. నాటో సభ్య దేశాలను పిరికిపందలుగా అభివర్ణించడమే కాకుండా.. భవిష్యత్తులో ఈ వైఖరిని గుర్తుంచుకుంటానని బహిరంగంగానే హెచ్చరించారు.
ట్రంప్ విమర్శల ప్రకారం.. అమెరికా అండ లేకపోతే నాటో కూటమి కేవలం ఒక పేపర్ టైగర్ (కాగితపు పులి) మాత్రమే. ఏటా కొన్ని వందల బిలియన్ డాలర్లను నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ఖర్చు చేస్తోందని.. కానీ అవసరమైనప్పుడు ఆ దేశాలు అమెరికాకు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఒకవైపు ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు, గ్యాస్ ధరల గురించి గగ్గోలు పెడుతున్న ఈ దేశాలు.. ఆ సమస్యకు మూలమైన హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి మాత్రం సైనిక సాయం చేయకపోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ట్రంప్ మండిపడ్డారు.

ఇరాన్‌పై చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, తమ లక్ష్యాలను సాధించడంలో అమెరికా విజయవంతమైందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ యొక్క క్షిపణి సామర్థ్యం, లాంచర్లు, నావికా దళం, వాయుసేన మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అమెరికా సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశామని, దీనివల్ల ప్రపంచానికి ముప్పు తప్పిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు నాటో దేశాల సాయం కానీ, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి దేశాల సైనిక సహకారం కానీ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
అయినప్పటికీ, పశ్చిమాసియాలోని తన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ మరియు కువైట్ దేశాల భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. హార్ముజ్ జలసంధిని వినియోగించుకునే దేశాలే ఆ మార్గానికి రక్షణ కల్పించుకోవాలని, ఒకవేళ ఎవరికైనా సహాయం కావాలంటే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరాన్ నుండి ముప్పు తొలగిపోయినందున ఇకపై అక్కడ అమెరికా సైన్యం కాపలా కాయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్‌తో కలిసి నిర్వహించిన ఈ భారీ సైనిక ఆపరేషన్‌ను నిలిపివేయాలని అమెరికా యోచిస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని అణచివేయడం ద్వారా తమ పని పూర్తయిందని భావిస్తున్న ట్రంప్, తమకు సహకరించని దేశాలు తెలివితక్కువ పొరపాటు చేశాయని ఎద్దేవా చేశారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో, ముఖ్యంగా అమెరికా-యూరప్ దేశాల మధ్య కొత్త చీలికలకు దారితీసేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications