అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం క్లోజ్.. రేపటి నుంచి పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది..
నెలల తరబడి సాగిన తీవ్ర సైనిక పోరాటానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్‌ల మధ్య జూన్ 17న కుదిరిన చారిత్రాత్మక 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU) ఆగస్టు 17, సోమవారంతో అధికారికంగా ముగిసింది. శాశ్వత శాంతి ఒప్పందమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సంతకాలు చేసిన ఈ ఒప్పందం.. గడువు ముగియడానికి ముందే పూర్తిగా విఫలమై రద్దయ్యే దిశగా చేరుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటుగా.. పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి.
జూన్ 17 ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తక్షణమే సైనిక చర్యలను నిలిపివేసి 60 రోజుల్లోగా సమగ్ర ఒప్పందాన్ని రూపొందించుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా అమెరికా 30 రోజుల్లో నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తూ.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, $300 బిలియన్ల పునర్నిర్మాణ ప్యాకేజీని అందించడానికి అంగీకరించింది. ప్రతిగా, ఇరాన్ హార్ముజ్ జలసంధిలోని మైన్లను తొలగించి వాణిజ్య నౌకల ప్రయాణానికి అనుమతించడంతో పాటు.. అణ్వాయుధాలు తయారు చేయబోమని పునరుద్ఘాటించాల్సి ఉంది. అయితే ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే పరస్పర ఆరోపణలతో ఇరు పక్షాలు తమ కట్టుబాట్ల నుంచి తప్పుకున్నాయి.

హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవలేదని అమెరికా ఆరోపించగా.. దిగ్బంధనం ఆంక్షల ఎత్తివేత వాగ్దానాలను అమెరికా నెరవేర్చలేదని ఇరాన్ విమర్శించింది. ఈ వివాదాల నేపథ్యంలో జూలై 7 నాటికే అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఇరాన్ కూడా తన బాధ్యతల నుంచి వైదొలిగింది. సోమవారంతో గడువు ముగియడం కేవలం ఒక రకమైన సాంకేతిక ముగింపు మాత్రమేనని, ఆచరణలో ఈ ఒప్పందం ఇప్పటికే నిష్ఫలమైందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ వివాదానికి హార్ముజ్ జలసంధి ప్రధాన కేంద్రబిందువుగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం కేవలం తమ సంపూర్ణ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. 60 రోజుల గడువు ముగిసినంత మాత్రాన వాణిజ్య నౌకల ప్రయాణం సాధారణ స్థితికి రాదని టెహ్రాన్ తేల్చిచెప్పింది. శనివారం ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది మాట్లాడుతూ.. ఇరాన్ ఆదేశాల మేరకే ఈ జలమార్గం తెరుచుకుంటుందని లేదా మూసివేయబడుతుందని వ్యాఖ్యానించారు. ఇది అమెరికాకు ఎదురైన అతిపెద్ద ఓటమి అని, వాషింగ్టన్ ఈ వాస్తవాన్ని అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, హార్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం మరియు భద్రతా నియంత్రణ కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. తాజా పరిణామాలతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర అభద్రతకు లోనైంది. ఈ జలమార్గంలో వాణిజ్య నౌకల ప్రయాణానికి అంతరాయం ఏర్పడటం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దౌత్యపరమైన తలుపులు మూసుకుపోవడంతో.. గల్ఫ్ ప్రాంతంలో సైనిక సమీకరణలు పెరుగుతూ మళ్లీ మునుపటి ఉద్రిక్త పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
