భగ్గుమన్న ముడిచమురు ధరలు.. హార్ముజ్ టెన్షన్‌తో భారత్‌కు భారీ ముప్పు.. రూపాయికి బిగ్ షాక్..
ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో ఏర్పడిన ఆటంకాల కారణంగా ప్రపంచ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును అధిగమించి, ప్రస్తుతం సుమారు 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే చమురు ధరలలో 5 శాతం నుండి 6 శాతం వరకు పెరుగుదల నమోదైంది.
ప్రధానంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారానికి నిర్దేశించిన 60 రోజుల గడువు ముగియడం.. దౌత్యపరమైన చర్చలలో ఎలాంటి పురోగతి లేకపోవడం మార్కెట్‌లో ఆందోళనను పెంచింది. అదే సమయంలో ఇరు దేశాల నాయకుల మధ్య కొనసాగుతున్న పరస్పర హెచ్చరికలు మరియు విమర్శలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.

దీనికితోడు మధ్యప్రాచ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు మళ్లీ మొదలవ్వడం, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దాడులు కొనసాగుతుండటం సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ మార్గం ద్వారా సాగే రవాణాకు భద్రత కరువవ్వడం వల్ల చమురు నిల్వలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. కేడియా అడ్వైజరీ కమోడిటీ నిపుణుల ప్రకారం, ఒప్పందంపై స్పష్టత లేకపోవడం వల్ల ముడి చమురు ధరలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో కూడా లాభాలతోనే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ ధరలు అధిక స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో ధరలు ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందనే దానిపై కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకులు స్పందిస్తూ.. ఒకవేళ ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరమైనా లేదా సరిహద్దుల్లో దాడులు మరింత పెరిగినా ముడి చమురు ధర రాబోయే రోజుల్లో బ్యారెల్‌కు 95 డాలర్ల మార్కు వరకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే సైనిక చర్యలు తగ్గుముఖం పట్టి, దౌత్యపరమైన చర్చలు తిరిగి ప్రారంభమైతే మాత్రమే ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.
భారత్ తన చమురు అవసరాల్లో 85% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 91 డాలర్లు దాటిపోవడంతో, భారత్ చమురు కొనుగోలు చేయడానికి మరింత ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది.
మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఓపెక్) నుండి బలహీనమైన డిమాండ్ అంచనాలు వెలువడటం, అలాగే అమెరికాలో అకస్మాత్తుగా చమురు నిల్వలు పెరగడం వల్ల ధరలు మరింత వేగంగా పెరగకుండా కొంతవరకు నిరోధించబడ్డాయి. వ్యాపారులు ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్లే వారపు పెరుగుదల 5 నుండి 6 శాతానికి పరిమితమైంది. అయినప్పటికీ హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి, ముంచుకొస్తున్న ఆంక్షల దృష్ట్యా రాబోయే రోజుల్లో చమురు మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications
