US మిలిటరీకి ఎదురుదెబ్బ.. హార్ముజ్ జలసంధి సమీపంలో కుప్పకూలిన అపాచీ హెలికాప్టర్.. అసలేం జరిగింది..
వ్యూహాత్మకంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన అధునాతన 'అపాచీ' దాడి హెలికాప్టర్ కూలిపోయింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు , తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ ప్రమాదం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ అంతర్జాతీయ నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలట్లను సురక్షితంగా రక్షించారని, రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని రక్షణ రంగ అధికారులు ధృవీకరించారు. అయితే, ఈ శక్తివంతమైన యుద్ధ హెలికాప్టర్ కూలిపోవడానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులపై అమెరికా సైన్యం (యూఎస్ ఆర్మీ) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ప్రమాదం వెనుక సాంకేతిక లోపం ఉందా, కార్యాచరణ సమస్యలు తలెత్తాయా, లేదా శత్రువుల క్షిపణి కాల్పుల వల్ల ఇది కూలిపోయిందా అనే కోణంలో సైనిక అధికారులు నిశితంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ ప్రమాదం జరిగిన హోర్ముజ్ జలసంధి ప్రాంతం ప్రస్తుతం అమెరికా, ఇరాన్ , ఇజ్రాయెల్ దేశాల మధ్య సాగుతున్న వ్యూహాత్మక సైనిక పోటీకి ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. సముద్ర మార్గాల్లో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా రక్షణ కల్పించడం , ప్రాంతీయ ముప్పులను తిప్పికొట్టడం లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఆ ప్రాంతంలో తన సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచింది.
ఇందులో భాగంగానే అపాచీ హెలికాప్టర్లతో పాటు ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఎఫ్/ఏ-18 , ఎఫ్-35 వంటి అత్యాధునిక రకం యుద్ధ విమానాలను వాషింగ్టన్ అక్కడ మొహరించింది. దీనికి తోడుగా, భద్రతా కారణాలను చూపుతూ ఏప్రిల్ నెలలో ఇరాన్ ఓడరేవులకు అమెరికా ప్రవేశ పరిమితులు విధించడంతో వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య సముద్రపు ఉద్రిక్తతలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న ప్రత్యక్ష క్షిపణి దాడుల ఘర్షణలు ప్రస్తుతం కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు సంకేతాలు వస్తున్నాయి. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే, అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాల తర్వాత ఇరాన్ తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఆ సరిహద్దులో ప్రస్తుతానికి కాల్పులు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు.
అయినప్పటికీ, ఈ కాల్పుల విరమణ చాలా వీక్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ దక్షిణ బీరుత్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించినట్లుగా సైనిక చర్యలు కొనసాగితే, తాము మళ్లీ ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇటు ఇరాన్ గనుక దాడులు పునఃప్రారంభిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ కూడా ప్రతిసవాల్ విసిరింది. ఈ సున్నితమైన , ఉత్కంఠభరితమైన సైనిక వాతావరణంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోవడానికి గల అసలు కారణాలు అమెరికా రక్షణ శాఖ పూర్తి స్థాయి విచారణ నివేదికను వెల్లడించాకే స్పష్టమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
