ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..హార్ముజ్ జలసంధి వేదికగా పశ్చిమాసియాలో సరికొత్త వార్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచాయి. ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో.. ట్రంప్ తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఇరాన్ చర్చలకు వచ్చినా రాకపోయినా తనకు అనవసరమని, ఆ దేశం ప్రస్తుతం అత్యంత దీన స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని తాము ఎప్పటికీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై నియంత్రణ సాధించడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా కలిగి ఉన్న ఈ మార్గాన్ని దిగ్బంధించాలని అమెరికా నావికాదళానికి Trump ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు టోల్ రుసుము చెల్లించే ఏ నౌకనైనా తాము అడ్డుకుంటామని, అలాగే సముద్రంలో అమర్చిన మందుపాతరలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ఈ మందుపాతరల నెపంతో జలసంధిని తన అదుపులోకి తీసుకోవాలని చూస్తోందని.. ఇది ఒక రకమైన దోపిడీ అని ట్రంప్ విమర్శించారు. ఒకవేళ అమెరికా దళాలపై కానీ, వాణిజ్య నౌకలపై కానీ దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులైన వారిని కాల్చివేస్తామని హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్ కూడా అమెరికా వ్యాఖ్యలకు ధీటుగానే బదులిస్తోంది. చర్చలు విఫలం కావడానికి అమెరికా యొక్క అతివాద లక్ష్యాలే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు. శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్న తరుణంలో అమెరికా వెనక్కి తగ్గడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. హార్ముజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని, శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హెచ్చరించింది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తాము తిప్పికొడతామని స్పష్టం చేసింది.
ఈ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగడం పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చింది. అమెరికా తీసుకునే తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్న ఇజ్రాయెల్, అవసరమైతే ఇరాన్‌పై నేరుగా దాడులు చేసేందుకు తన సైన్యాన్ని (IDF) సిద్ధం చేసింది. ఏప్రిల్ 22 వరకు తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఎప్పుడైనా మొదలయ్యే అవకాశం ఉందనిపిస్తోంది. అగ్రరాజ్యం ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికపరంగా నిర్బంధించే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
మొత్తానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న ఆశలు ఆవిరైపోగా.. యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేత జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన ఉన్నత స్థాయి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పోరాటంలో ఇటు అగ్రరాజ్యం పట్టుదల, అటు ఇరాన్ హెచ్చరికల మధ్య పశ్చిమాసియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications