ఇరాన్ యుద్దంపై ట్రంప్ కీలక ప్రకటన.. వార్ ముగించేద్దాం అంటూ టెహ్రాన్ సంచలన వ్యాఖ్యలు..
అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ దేశాల మధ్య గత ఆరు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర సైనిక ఘర్షణలు, ఉద్రిక్తతలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు, ఇంధన రవాణాకు అత్యంత వ్యూహాత్మక కేంద్రమైన హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దక్షిణాది కరోలినాలోని మిర్టిల్ బీచ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడారు.
హార్ముజ్ జలసంధిని ప్రస్తుతం ఒక అమెరికా భూభాగంగానే తాను చూస్తున్నానని.. ఆ కీలక జలమార్గంపై వాషింగ్టన్‌కు సంపూర్ణ నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందడానికి అనుమతించేది లేదని ఆయన హెచ్చరించారు. దౌత్య పరమైన చర్చల గురించి ప్రస్తావిస్తూ.. టెహ్రాన్‌లో తమతో మాట్లాడేందుకు స్పష్టమైన రాజకీయ నాయకత్వం లేకపోవడమే ప్రస్తుతం వాషింగ్టన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని పేర్కొన్నారు. ఇరాన్ రాజకీయ నాయకులు అధ్యక్ష పదవిని చేపట్టడానికి కూడా ముందుకు రావడం లేదని.. ఈ పరిస్థితుల్లో ఎవరితో ఒప్పందం చేసుకోవాలో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.

మరోవైపు ఆరు నెలలుగా సాగుతున్న ఈ తీవ్ర సైనిక పోరాటానికి వెంటనే ముగింపు పలకాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బహిరంగంగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరాన్ ఎంతో బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉందని, ఈ సమయంలో యుద్ధాన్ని విరమించడమే ఇరు దేశాలకు మరియు ప్రపంచానికి శ్రేయస్కరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి ఇరాన్‌లోని పాఠశాలలు, ఆసుపత్రులు మరియు మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ద్వేషాన్ని మూటగట్టుకుందని ఆరోపించారు.
ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఇలా ఉండగా.. అక్కడి సైనిక బలగాలు మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భూమి, సముద్రం, ఆకాశం, సైబర్‌స్పేస్ వంటి అన్ని రంగాల్లో ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్-జనరల్ అలీ అబ్దుల్లాహి స్పష్టం చేశారు. తీవ్రమైన, వినాశకరమైన ప్రతిదాడి చేయడానికి తమ బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు.
ఈ ఉద్రిక్తతల నడుమ దౌత్య మార్గాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హార్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకాయాన పరిస్థితులు, అమెరికా దిగ్బంధనంపై ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్ సంభాషణ ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ జలమార్గాన్ని ఇరాన్ పాక్షికంగా మూసివేయగా.. అమెరికా నౌకాదళం రహస్యంగా చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తూ రోజుకు మిలియన్ల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది.
సైనిక ఒత్తిడితో పాటు ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా నూతన వ్యూహాన్ని అమలు చేస్తోంది. దౌత్యం కంటే ఆర్థిక ఆంక్షల ద్వారానే ఇరాన్ పాలకులను లొంగదీసుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. అమెరికా యొక్క ఈ చర్యను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది కేవలం ఆర్థిక ఉగ్రవాదం మాత్రమేనని మండిపడింది. ఈ వివాదంపై చైనా స్పందిస్తూ.. ఏకపక్ష ఆంక్షలు ఏ సమస్యకూ పరిష్కారం కాజాలవని, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారానే శాంతియుతంగా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని హితవు పలికింది.


Click it and Unblock the Notifications
