ఇది కూడా ఓ యుద్ధమేనా.. ఇరాన్ వార్‌పై ట్రంప్ వెటకారం.. ఇంకా ఏమన్నారంటే..
ఇరాన్‌తో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, గ్యాస్ ధరల పెరుగుదల, 18 మంది అమెరికన్ సైనికుల ప్రాణ నష్టానికి దారితీసిన తీవ్రమైన పరిస్థితిని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఓవల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో జరుగుతున్న పోరాటాన్ని "యుద్ధం" అని పిలవడం సరికాదని, ఇది కేవలం అమెరికాకు ఒక "చిన్న సైనిక ఘర్షణ" (Minor Military Clash) మాత్రమేనని పేర్కొన్నారు.
అంతకుముందు రోజు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానిస్తూ.. ప్రధాన పోరాట ప్రక్రియలు నెలల క్రితమే ముగిశాయని, అందుకే దీనిని యుద్ధంగా చూడకూడదని తెలిపారు. దానికి మద్దతుగా మాట్లాడిన ట్రంప్, మేము ప్రస్తుతం పూర్తిస్థాయిలో పోరాడటం లేదు. అసలు అక్కడ పెద్దగా పోరాటమే లేదు, కేవలం అడపాదడపా మాత్రమే దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా దళాలు ఉన్నాయని.. వాయు రక్షణ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలతో సహా దాదాపు 60 ఇరాన్ సైనిక లక్ష్యాలను విజయవంతంగా ఛేదించామని వెల్లడించారు.

ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్య కంటే ఆర్థిక పరమైన ఆంక్షల ద్వారా దాన్ని బలహీనపరిచే వ్యూహానికే అమెరికా మొగ్గు చూపుతోందని ట్రంప్ సూచించారు. ఇరాన్‌కు ప్రధాన ఆర్థిక ఆసరాగా ఉన్న చైనాపై వ్యాఖ్యానిస్తూ, రాబోయే రోజుల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అధికారిక సమావేశం ఉన్న నేపథ్యంలో బీజింగ్ పాత్ర చాలా స్వల్పమైనదని పేర్కొన్నారు. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సిరియా మీదుగా వెళ్లే భూమార్గ పైప్‌లైన్ల అభివృద్ధి ద్వారా ఇరాన్ సముద్ర మార్గంపై ఆధారపడటం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
శాంతియుత ప్రకటనలు చేస్తూనే, టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న ఇరాన్ అనుమానిత భూగర్భ అణు ల్యాబ్ 'పిక్యాక్స్' (Pickaxe) పై త్వరలోనే దాడులు చేసే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. సుసంపన్నమైన యురేనియం నిల్వలను ఇరాన్ ఇక్కడ భద్రపరిచిందని భావిస్తున్నారు. ఎవరైనా దీనిని యుద్ధం అని పిలిచినా, పిలవకపోయినా తాము ఈ సైనిక ఘర్షణలో అద్భుతమైన విజయం సాధించామన్నదే ప్రధాన అంశమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక ప్రపంచవ్యాప్త ముడి చమురు మరియు ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణాకు అత్యంత కీలకమైన 'హా ర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న సైనిక ఘర్షణల నేపధ్యంలో ఈ జలమార్గం గుండా సాగే అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు గణనీయంగా పడిపోయాయి. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ దాదాపు 125 భారీ వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ప్రయాణించే ఈ జలసంధిలో, ప్రస్తుత ఆంక్షలు, సైనిక భయాందోళనల వల్ల ఆ సంఖ్య రోజుకు కేవలం 3 నుండి 10 నౌకలకు మాత్రమే పరిమితమైంది.
ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘర్షణల తీవ్రత తగ్గుతోందని ప్రకటిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ నావికా సంస్థలు, సెంట్రల్ బ్యాంకులు మాత్రం హార్ముజ్ జలసంధిలో ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications

