అమెరికాను సర్వనాశనం చేస్తాం.. శాంతి ఒప్పందానికి రాకుంటే పూర్తి స్థాయి దాడులకు దిగుతామని ఇరాన్ ప్రకటన..
అమెరికా- ఇరాన్‌ల మధ్య నెలకొన్న తాత్కాలిక సైనిక విరామానికి తెరపడి.. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర యుద్ధ మేఘాలు అలముకున్నాయి. జూన్‌లో కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పంద గడువు ముగిసినప్పటికీ దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని పొడిగించడానికి నిరాకరించారు. ఈ పరిణామంపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్‌తో దౌత్య మార్గాలు విఫలమైతే తమ రక్షణాత్మక వైఖరిని వీడి, ప్రతీకారంగా పూర్తిస్థాయి దాడి సైనిక వ్యూహానికి మారతామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు సంచలన హెచ్చరిక చేశారు.
ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ప్రధాన వివాద కేంద్రంగా మారింది. జూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం విఫలమవ్వడంతో అమెరికా ఆంక్షలు, నావికా దిగ్బంధనం, ఇరాన్ అణు కార్యక్రమం, జలసంధిలో నౌకాయాన హక్కులపై స్పష్టత కరువైంది. అమెరికా విధిస్తున్న నావికా దిగ్బంధనాన్ని ఛేదించడానికి తమ సైన్యం కచ్చితమైన చర్యలకు సిద్ధమవుతోందని ఇరాన్ స్పష్టం చేసింది. ఒప్పంద నిబంధనలను నెరవేర్చడానికి వాషింగ్టన్‌కు కొన్ని వారాల గడువు ఇస్తామని.. లేని పక్షంలో హార్ముజ్ జలసంధి, పరిసర ప్రాంతాలలో సైనిక చర్యలను ముమ్మరం చేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.

మరోవైపు పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిపై తమకే సంపూర్ణ సార్వభౌమాధికారం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ధరించింది. ఈ జలమార్గంపై అమెరికాకు ఎటువంటి హక్కులు లేవని స్పష్టం చేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించగలమని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్‌తో ఇరాన్ ప్రత్యేక నౌకాయాన ఒప్పందంపై చర్చలు జరుపుతుండగా.. ఒమన్ ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఆ దేశంపై బాంబులు వేస్తామని ట్రంప్ ప్రత్యక్షంగా బెదిరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
ఈ యుద్ధ భయాలు, సరఫరా ఆటంకాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హార్ముజ్ గుండా ట్యాంకర్ల రాకపోకలు మందగించడంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $2.35 పెరిగి $90.87కి చేరగా.. అమెరికన్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ $84.50 వద్దకు చేరింది. చమురు సరఫరా పునరుద్ధరణ కాకపోతే అమెరికాలో గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు, అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతుగల దళాల చర్యలతో పాటు హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ షాక్‌ను తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒప్పంద గడువు ముగియడం, ఇరుపక్షాలు కఠిన వైఖరులను ప్రదర్శిస్తుండటంతో.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాల ప్రకారం ఇరాన్ సుదీర్ఘ పోరాటానికి సమాయత్తమవుతోంది. ప్రాంతీయ మిత్రదేశాలు, ప్రాక్సీ గ్రూపులను ఏకం చేస్తూ సైనిక బలగాలను మోహరిస్తోంది. హార్ముజ్ జలసంధి వద్ద రక్షణ పునరుద్ధరణ, దౌత్య పునఃప్రారంభం జరగకపోతే, ఈ ఘర్షణ విస్తరించి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసే దిశగా సాగుతోంది.


Click it and Unblock the Notifications
