US India Tariff Dispute : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద విధించిన 50 సుంకాల వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. ఈ సుంకాల దాడితో వాణిజ్య పరంగా అమెరికా-భారత్ సంబంధాలు సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి కీలక రంగాల్లో అమెరికా కంపెనీల ఎంట్రీకి భారత్ అడ్డుకట్ట వేస్తోంది. దేశ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మోదీ సర్కారు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. దీనికి తోడు భారత్ రష్యా చమురు కొనుగోలుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మరి కొద్ది రోజుల్లో మళ్లీ సుంకాల దాడి ప్రారంభిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధిక సుంకాల నేఫథ్యంలో భారత్‌తో మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉందా అని ఓ విలేఖరి ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో చర్చలకు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ఆపే వరకు ఎటువంటి చర్చలకు తావుండదన్నారు.

ఇప్పటికే ట్రంప్ పరిపాలన భారత దిగుమతులపై 25 శాతం టారీఫ్ విధించిన నేపథ్యంలో, బుధవారం మరోసారి అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా మొత్తం టారీఫ్ 50 శాతానికి చేరింది. కొత్త టారీఫ్‌లు వచ్చే 21 రోజుల్లో అమల్లోకి వస్తాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఇది యుఎస్ పోర్టులలోకి ప్రవేశించే భారతీయ వస్తువులన్నింటికీ వర్తిస్తుంది. అయితే అయితే కొన్నివస్తువలకు మినహాయింపులు మాత్రం ఉంటాయి.
ఈ అధిక సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగానే బదులిచ్చారు. ఢిల్లీలో జరిగిన హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది స్మారక సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అమెరికా ఆర్థిక ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.భారత రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకే మా మొదటి ప్రాధాన్యత అన్నారు. వాటిపై రాజీ పడే ఉద్దేశ్యం లేదని... అవసరమైతే వ్యక్తిగతంగా ఏమైనా మూల్యం చెల్లించాల్సి వచ్చినా.. సిద్ధంగా ఉన్నామని మోదీ ఘాటుగా స్పందించారు.భారత ప్రభుత్వం వ్యవసాయ ప్రయోజనాల విషయంలో రాజీ పడదంటూ స్పష్టం చేశారు.
ట్రంప్ సుంకాల దాడిపై తాడో పేడో తేల్చుకుందాం.. భారత్‌కు పూర్తి మద్ధతు ప్రకటించిన చైనా..
భారత ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి సున్నిత రంగాల్లో విదేశీ ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగాలు కోట్లాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా మారాయి. అందుకే ఈ రంగాల రక్షణ విషయంలో రాజీపడేది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలోనే ఇప్పటికి ఎనిమిది గంటలే అయ్యాయి. మీరు ఇంకెన్నో చూడబోతున్నారంటూ ట్రంప్ మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే చైనా వంటి దేశాలు కూడా రష్యా చమురు కొనుగోలు చేస్తున్నా.. భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు అన్న ప్రశ్నకు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications