ఎన్విడియా చిప్స్ చైనాకు బంద్: అమెరికా ఆంక్షల వెనుక అసలు కథ!
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్.. ఓ చైనా మహిళా గూఢచారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, దాని ద్వారానే అమెరికా ఆంక్షలను దాటుకుని సింగపూర్ మీదుగా చైనాకు బిలియన్ల డాలర్ల విలువైన ఎన్విడియా ఏఐ చిప్‌లు చేరాయని ఆరోపణలు వస్తున్నాయి.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో, ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆగ్నేయాసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలను విధించింది.
ఈ కొత్త నిబంధనల ద్వారా అమెరికా కంపెనీల చిప్‌లు చైనాకు చేరకుండా పూర్తిగా అడ్డుకోవాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది.
తాజా నిబంధనల ప్రకారం.. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లోని డేటా సెంటర్ కంపెనీలు ఇకపై ఎన్విడియాతో పాటు ఇతర అమెరికన్ కంపెనీల నుంచి ఏఐ చిప్‌లు కొనాలంటే, అమెరికా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.

ఈ లైసెన్స్ లేని ఏ కంపెనీ కూడా అమెరికా సంస్థల నుంచి చిప్‌లను కొనుగోలు చేయలేదని యూఎస్ వాణిజ్య విభాగం సోమవారం స్పష్టం చేసింది.
గత కొన్నేళ్లుగా ఆగ్నేయాసియా దేశాలు ఏఐ టెక్నాలజీ అభివృద్ధి, శిక్షణలో వేగంగా పురోగమిస్తున్నాయి. దీంతో అక్కడ డేటా సెంటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అధిక భాగం చైనాకు చెందిన అలీబాబా, బైట్‌డాన్స్ వంటి కంపెనీల ఏఐ మోడల్స్ అభివృద్ధికి ఉపయోగపడుతోంది. ఉదాహరణకు, చైనా ఏఐ కంప్యూటింగ్ పవర్లో దాదాపు 30 శాతం విదేశీ డేటా సెంటర్ల నుంచే అందుతోందని అంచనా.
ఈ నేపథ్యంలో, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే అమెరికన్ ఏఐ చిప్‌లను నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం 132 పేజీల కఠిన నిబంధనలతో రంగంలోకి దిగింది. చైనా కోసం ఎన్విడియా వంటి కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేసిన 'స్టెప్-డౌన్' చిప్‌లు కూడా ఈ కొత్త ఆంక్షల పరిధిలోకి వస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల చిప్ కంపెనీల ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియాతో పాటు బ్రెజిల్‌ను కూడా ఈ ఆంక్షల జాబితాలో చేర్చింది.
అమెరికా విధించిన ఈ కొత్త నిబంధనలను సింగపూర్, బ్రెజిల్ ప్రభుత్వాలు తీవ్రంగా సమీక్షించడం ప్రారంభించాయి. ఈ నిబంధనలు తమ వాణిజ్యానికి అడ్డంకిగా మారుతాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నాయి.


Click it and Unblock the Notifications