అమెరికాలోని భారత ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు.. 540 రోజుల పిరియడ్ రద్దు చేసిన ట్రంప్ సర్కారు..
US Immigration Update: అమెరికాలో ఉపాధి అనుమతి పత్రాల (EAD) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది వలసదారులకు.. ముఖ్యంగా భారతీయ IT రంగానికి చెందిన H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు (H-4 వీసా హోల్డర్లు) బిగ్ షాక్ తగిలింది.
పెండింగ్లో ఉన్న వర్క్ పర్మిట్ దరఖాస్తుదారులకు లభించే 540 రోజుల 'ఆటోమేటిక్ పొడిగింపు' (Automatic Extension) విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) తుది నిబంధనలను జారీ చేసింది. అక్టోబర్ 14, 2026న ఫెడరల్ రిజిస్టర్లో ఇది ప్రచురితమైన వెంటనే అమల్లోకి వస్తుందని బ్లూమ్బెర్గ్ లా నివేదించింది. దీంతో అక్టోబర్ 2025లో ట్రంప్ పరిపాలన ప్రవేశపెట్టిన తాత్కాలిక నిబంధన ఇప్పుడు శాశ్వత చట్టంగా మారింది.

540 రోజుల 'ఆటోమేటిక్ పొడిగింపు' (Automatic Extension) అంటే ఏమిటి: అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులు (ఉదాహరణకు H-4 వీసాదారులు, ఆశ్రయం కోరేవారు మొదలైనవారు) తమ వర్క్ పర్మిట్ లేదా EAD (Employment Authorization Document) గడువు ముగియబోతున్నప్పుడు దాన్ని రెన్యువల్ (Renewal) కోసం దరఖాస్తు చేసుకుంటారు. గతంలో ఇమ్మిగ్రేషన్ విభాగం (USCIS) ఈ దరఖాస్తులను ప్రాసెస్ చేసి కొత్త EAD కార్డు ఇచ్చే వరకు చాలా నెలల సమయం పట్టేది. ఆ జాప్యం వల్ల ఉద్యోగులు పాత పర్మిట్ గడువు ముగిసి ఉద్యోగాలు కోల్పోకుండా ఉండేందుకు.. బైడెన్ ప్రభుత్వం ఒక వెసులుబాటు తెచ్చింది.
దానిప్రకారమే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు వచ్చింది. ఒకసారి వర్క్ పర్మిట్ రెన్యూవల్ అప్లికేషన్ సబ్మిట్ చేయగానే, పాత EAD కార్డు గడువు ముగిసినప్పటికీ, అధికారులు నిర్ణయం తీసుకునే వరకు ఆటోమేటిక్గా 540 రోజుల పాటు (దాదాపు 18 నెలలు) పాత పర్మిట్పైనే అమెరికాలో ఉద్యోగం కొనసాగించే చట్టబద్ధమైన హక్కు లభించేది. దీనివల్ల USCIS అధికారుల ప్రాసెసింగ్ ఎంత ఆలస్యమైనా (కార్డు రావడానికి నెలల సమయం పట్టినా), ఉద్యోగికి జీతం లేదా ఉద్యోగంలో ఎటువంటి ఆటంకం (Gap) వచ్చేది కాదు.
తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఈ 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు నిబంధనను పూర్తిగా రద్దు చేసి చట్టాన్ని శాశ్వతం చేసింది. ఇకపై EAD రెన్యూవల్ అప్లై చేసినంత మాత్రాన పాత కార్డుకు 540 రోజుల గడువు పొడిగింపు లభించదు. మీ పాత EAD గడువు ముగిసేలోగా USCIS నుండి కొత్త EAD కార్డు ఆమోదం పొంది చేతికి రాకపోతే.. కొత్త కార్డు వచ్చే వరకు మీరు తప్పనిసరిగా ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి వస్తుంది (లేదా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంటుంది). అందుకే ప్రస్తుతం USCIS దరఖాస్తుదారులను తమ EAD గడువు ముగియడానికి 180 రోజుల (6 నెలలు) ముందుగానే పునరుద్ధరణ దరఖాస్తులు సమర్పించాలని సూచిస్తోంది.
ఈ సంచలన విధాన మార్పు వెనుక ఉన్న కీలక పరిణామాలు నిబంధనలు:
1. భద్రత, బ్యాక్గ్రౌండ్ చెక్లకే తొలి ప్రాధాన్యం: USCIS వద్ద ప్రాసెసింగ్ జాప్యం జరిగినప్పటికీ విదేశీ కార్మికులు ఉద్యోగాలు కోల్పోకుండా చూసేందుకు గత బైడెన్ యంత్రాంగం 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును అమలు చేసింది. అయితే దరఖాస్తుదారుల నేపథ్యాలను, భద్రతను తరచుగా తనిఖీ చేయడం ద్వారా మోసాలను అరికట్టడానికే ఈ ఆటోమేటిక్ పొడిగింపులను ముగిస్తున్నట్లు USCIS స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేయడం అనేది ఒక ప్రత్యేక అవకాశమే (Privilege) తప్ప హక్కు కాదని USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వ్యాఖ్యానించారు.
2. నాలుగు లక్షలకు పైగా నిలిచిపోయిన దరఖాస్తులు - ఉపాధికి విఘాతం: ఈ కొత్త నిబంధన అమల్లోకి రావడంతో.. EAD పునరుద్ధరణ దరఖాస్తు సమర్పించినంత మాత్రాన పాత వర్క్ పర్మిట్ గడువు దానంతటదే పొడిగించబడదు. బ్లూమ్బెర్గ్ లా ప్రకారం.. జూన్ 30 నాటికి USCIS వద్ద 4,32,000 కంటే ఎక్కువ పునరుద్ధరణ దరఖాస్తులు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 91,000 కి పైగా అప్లికేషన్లు ఏకంగా ఏడాదిన్నరగా ప్రాసెసింగ్లోనే ఉన్నాయి. USCIS కొత్త అనుమతి జారీ చేసేలోపు పాత EAD గడువు ముగిస్తే, అభ్యర్థులు విధిగా ఉద్యోగానికి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
3. హెచ్-4 వీసాదారులు, ఆశ్రయం కోరేవారిపై తీవ్ర ప్రభావం: ఈ విధానం వల్ల ఆశ్రయం (Asylum) కోరేవారితో పాటు H-1B ప్రొఫెషనల్స్ జీవిత భాగస్వాములైన H-4 వీసా హోల్డర్లు తీవ్రంగా నష్టపోనున్నారు. అయితే ఈ విధానం అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ (APA) ను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ H-4 వీసాదారుల బృందం కాలిఫోర్నియా కోర్టులో వేసిన దావాలో.. గతేడాది న్యాయమూర్తి వాదులకు అనుకూలంగా తాత్కాలిక స్టే ఇచ్చారు. అయినప్పటికీ DHS జారీ చేసిన ఈ శాశ్వత తుది నిబంధన వలసదారులలో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
4. దరఖాస్తుదారులకు USCIS సూచనలు & మినహాయింపులు: అక్టోబర్ 30, 2025 కి ముందే ఆటోమేటిక్గా పొడిగించబడిన EADలకు, అలాగే టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) కింద లభించే కొన్ని నిర్దిష్ట మినహాయింపులకు ఈ కొత్త నిబంధన నుంచి వెసులుబాటు ఉంటుంది. మిగతా వర్గాల దరఖాస్తుదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే పునరుద్ధరణ దరఖాస్తులను (Renewal Applications) దాఖలు చేయాలని, ఏమాత్రం ఆలస్యం చేసినా ఉద్యోగ అనుమతిలో తాత్కాలిక అంతరాయం ఎదుర్కోవాల్సి వస్తుందని వలసదారుల విభాగం హెచ్చరించింది.


Click it and Unblock the Notifications
