అమెరికా వెళ్లాలని కలలుగంటున్న భారతీయులకు ఆ దేశం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. కొన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను సంబంధించిన ధరఖాస్తు రుసుమును పెంచుతూ US స్టేట్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్టూడెంట్, టూరిస్ట్ వీసాల ధరలు పెరగనున్నాయి. సందర్శకుల వీసాపై ఈ ధరను 160 డాలర్ల నుంచి 185కి పెంచారు. ఇతర వాటిని పరిశీలిస్తే మొత్తంగా 15 నుంచి 110 డాలర్ల మేర ఫీజులు పెంచినట్లు అక్కడి విదేశాంగ శాఖ ప్రకటించింది.
తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజుపై 15 డాలర్లు, ప్రత్యేక వృత్తి నిపుణుల వీసాలపై 110 డాలర్ల మేరకు అమెరికా అదనంగా వడ్డించనుంది. కొత్త ధరలు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి వస్తాయని సంబంధిత శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వేలాది రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.

వీసా రేట్ల పెంపు గురించి US డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్దిష్ట మార్పిడి సందర్శకులకు మాత్రం రెండేళ్ల పాటు రెసిడెన్సీ రుసుముతో ఇతర కాన్సులర్ ఫీజుల్లో మినహాయింపు కొనసాగుతుందని పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1 తర్వాత జరిగిన వీసా ఇంటర్వ్యూలకు సంబంధించి జరిపిన చెల్లింపు ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. అంటే సెప్టెంబర్ 2023 వరకు ఇబ్బందిలేదన్న మాట.
అయితే దరఖాస్తుదారులు ముందస్తుగా ఇంటర్వ్యూను షెడ్యూల్ చేయాలి లేదా సెప్టెంబర్ 30 లోపు మినహాయింపు దరఖాస్తును సమర్పించాలని US విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది. తమ దేశంలోకి ప్రవేశించ తలిచిన వలసదారులందరి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో దరఖాస్తుదారులు సహకరించాలని కోరింది.


Click it and Unblock the Notifications