Strait of Hormuz: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్.. చమురు సంక్షోభం నుంచి భారత్ సేఫ్..
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ గందరగోళంలో పడింది. ఇరాన్ తన వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతాన్ని మూసివేయడంతో.. గ్లోబల్ ఆయిల్ సప్లైలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఈ మార్గం గుండా ఓడల రాకపోకలు ఆగిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా ట్రెజరీ విభాగం 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు (Waiver) మంజూరు చేసింది.

అమెరికా నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ నిర్ణయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. "ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా నిరంతరం కొనసాగేలా చూడటమే మా లక్ష్యం. అందుకే భారతీయ రిఫైనరీలకు రష్యా చమురును కొనుగోలు చేసేందుకు 30 రోజుల తాత్కాలిక అనుమతి ఇస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ మినహాయింపు కేవలం సముద్రంలో నిలిచిపోయిన (Stranded at sea) రష్యా చమురు నౌకలకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక లాభం చేకూరదని, కేవలం ప్రస్తుత సరఫరా ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న 'స్టాప్-గ్యాప్' చర్య అని అమెరికా వివరించింది.
జలసంధి దిగ్బంధం , భారత్ ఆందోళన
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 40 శాతాన్ని పశ్చిమ ఆసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ నౌకలన్నీ హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే ప్రయాణించాలి. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడంతో భారత్‌లో చమురు కొరత ఏర్పడవచ్చని వార్తలు వచ్చాయి. అందుకే భారత్ తన వద్ద ఉన్న నిల్వలను కాపాడుకుంటూనే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రష్యా నుంచి చమురును తెప్పించుకోవడానికి మొగ్గు చూపింది. హెచ్‌పీసీఎల్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే మూడు నెలల విరామం తర్వాత రష్యా చమురు కొనుగోళ్లను మళ్లీ ప్రారంభించాయి.
భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త మలుపు
గతంలో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన దౌత్యపరమైన చర్చల తర్వాత ఆ ఆంక్షలను తొలగించారు. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం వేళ భారత్‌ను ఒక ముఖ్యమైన భాగస్వామిగా గుర్తించిన అమెరికా, ఈ మినహాయింపును ఇవ్వడం విశేషం. దీనివల్ల భారత రిఫైనరీలకు వచ్చే ఏప్రిల్ 4వ తేదీ వరకు రష్యా చమురును క్లియర్ చేసుకునే అవకాశం లభించింది.
మొత్తంగా భారత్‌లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేషనింగ్ (కోత) విధించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అది పేర్కొంది. ఈ అమెరికా వెయివర్ వల్ల హార్ముజ్ జలసంధి సమస్య ఉన్నప్పటికీ, రష్యా చమురు భారత్‌కు చేరుతుంది. ఇది దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగా ఉండటానికి , స్టాక్ మార్కెట్ లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications