Walmart Layoff's: ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన యూఎస్ సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్నాయి. నెలలు గడిచేకొద్దీ ఈ లిస్టులో కొత్త వారి పేర్లు వచ్చి చేరుతున్నాయి కానీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావటం లేదు. ఈ క్రమంలో మాంద్యం ముప్పు మధ్య ఆపిల్, వాల్‌మార్ట్ తాజా తొలగింపులపై కీలక ప్రకటన చేశాయి.
అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ తమ కేంద్రాలలో పనిచేస్తున్న 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. ఆన్‌లైన్ కస్టమర్ల అవసరాలకు మెరుగైన సేవలందించేందుకు కంపెనీ తన కార్యకలాపాలను సర్దుబాటు చేయాలని యోచిస్తోందని పేర్కొంది. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో 1,000 మంది ఉద్యోగులను, పెన్సిల్వేనియాలో 600 మందిని, ఫ్లోరిడాలో 400 మందిని, న్యూజెర్సీలో దాదాపు 200 మంది ఉద్యోగులను వాల్‌మార్ట్ తొలగించనున్నట్లు తెలుస్తోంది.

కంపెనీ గత నెల రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ త్వరలో పెద్ద తొలగింపులను చూడబోతున్నట్లు వెల్లడించింది. అయితే తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు సంస్థలో ఇతర పాత్రలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కంపెనీ నొక్కి చెప్పింది. జనవరితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అంతర్జాతీయ వ్యాపార నిర్వహణ ఆదాయం ఏకంగా 72 శాతం తగ్గి 300 మిలియన్ డాలర్లకు పడిపోవటంతో కంపెనీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.

గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఐఫోన్ తయారీదారు ఆపిల్ కూడా తన వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. కంపెనీ తన కార్పొరేట్ రిటైల్ టీమ్‌లలోని కొన్ని స్థానాల నుంచి ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తాజాగా వెల్లడైంది. అయితే వాస్తవంగా కంపెనీలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారనే వివరాలు స్పష్టంగా వెల్లడికాలేదు. ఆపిల్ తాజా చర్యలను తొలగింపుల కంటే క్రమబద్ధీకరించే ప్రయత్నంగా చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్టోర్ల నిర్వహణను మెరుగుపరచడానికి రూపొందిచబడ్డాయని కంపెనీ చెబుతోంది. అయితే బాధిత ఉద్యోగులకు తాము మద్దతునిస్తామని వెల్లడించారు.


Click it and Unblock the Notifications