Jackson Hole: వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. RBIపై ప్రభావం ఇదే..
Jerome Powell: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని పీడిస్తున్న విషయం పెరిగిన ద్రవ్యోల్బణం. ఇది ఆర్థిక వ్యవస్థలను కుదేలుచేయటంతో పాటు వ్యాపారాలు, ఉపాది వంటి అంశాలను ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపుపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ద్రవ్య విధానాన్ని సడలించాలని, వడ్డీ రేటులో కోతను సూచించారు. ప్రస్తుతం ప్రమాదం ద్రవ్యోల్బణం నుండి ఉపాధికి మారినందున, బహుశా ఫెడ్ జాబ్ మార్కెట్‌కు మద్దతునివ్వడం అవసరమన్నారు. అలాగే త్వరలో ద్రవ్య పరపతి విధానాన్ని సర్ధుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణానికి ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రమాదాలు దాదాపుగా తగ్గాయన్న పావెల్.. ప్రయాణ దిశ స్పష్టంగా ఉందన్నారు. రేటు తగ్గింపుల వేగం ఇన్‌కమింగ్ డేటా, అభివృద్ధి చెందుతున్న దృక్పథం, నష్టాల సమతుల్యతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బలమైన జాబ్ మార్కెట్‌ను కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థ 2% ద్రవ్యోల్బణానికి తిరిగి వస్తుందని భావించడానికి మంచి కారణం ఉందన్నారు. అలాగే ధరల స్థిరత్వాన్ని పునరుద్ధరించే పని "పూర్తి కాలేదు" కానీ మంచి పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం పావెల్ చెప్పినట్లుగా ఈ ఏడాది సమీప భవిష్యత్తులో ఫెడ్ రేట్లు తగ్గించాలని నిర్ణయించుకుంటే.. అది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి మూలధన ప్రవాహానికి దారి తీస్తుంది. అధిక రాబడిని కోరుతూ భారతీయ ఆస్తుల్లోకి పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో దేశీయ ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నట్లయితే భారత సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడానికి మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. తక్కువ రేట్లు రుణాలను చౌకగా తీసుకోవడం, పెట్టుబడిని పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తాయి. దీనికి తోడు బలమైన రూపాయి దిగుమతి ఖర్చులను తగ్గించటానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిడిని మరింత తగ్గించి, వృద్ధికి మద్దతు ఇవ్వడంపై RBI దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. మెుత్తానికి ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటనకు అనుగుణంగా భారత సెంట్రల్ బ్యాంక్ సైతం రేట్ల పెంపు లేదా తగ్గింపులకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications