Tesla Layoffs: ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలో సంచలనాలు సృష్టించిన టెస్లా ప్రస్తుతం ఊహించని ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో కంపెనీ వరుస లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉంది. పైగా కొత్త విస్తరణ ప్రణాళికలను వెంటనే నిలిపివేయటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇండియా విజిట్ సైతం ఎలాన్ మస్క్ ఇటీవల విరమించుకున్నారు.
తాజాగా బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ అందించినట్లు వెల్లడైంది. కంపెనీలో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులు తాజాగా తొలగింపులకు గురైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి ముందు గడచిన నెలలో ఈవీ కార్ మేకర్ తన ఉద్యోగుల సంఖ్యలో 10 శాతం మందిని తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దీని తర్వాత సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను, అలాగే సూపర్‌చార్జర్ వ్యాపారంలోని దాదాపు 500 మంది టీమ్ సభ్యులను తొలగించింది.

టెస్లా తన విస్తృత తొలగింపులలో భాగంగా వారాంతంలో తన ఉద్యోగులకు ఇమెయిల్‌లను పంపారు. కంపెనీ టెక్సాస్, కాలిఫోర్నియా, నెవాడా, న్యూయార్క్‌లోని తమ స్థానాల్లో 6,700 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గత నెలలో నోటీసుల్లో వెల్లడించింది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా టెస్లా అమ్మకాలు తగ్గటం, ప్రజల నుంచి ఈవీల కొనుగోళ్లు తగ్గటంతో పాటు అధిక వడ్డీ రేట్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో పెరుగుతున్న పోటీ వాతావరణం మస్క్ కంపెనీకి కొత్త ఛాలెంజ్ విసురుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాలో పరిస్థితులను చక్కదిద్దేందుకు గతవారం మస్క్ ఆకస్మిక పర్యటన చేసిన సంగతి తెలిసిందే.
కంపెనీ అటానమస్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్, రోబోటాక్సిస్, హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌పై దృష్టి పెట్టాలని చూస్తోంది. ఆ ప్రాజెక్ట్‌ల కోసం నగదును నిల్వ చేయడానికి మస్క్ కొన్ని బృందాలపై ఖర్చును తగ్గిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారీ తొలగింపులకు రెండవ త్రైమాసికంలో 350 మిలియన్ల కంటే ఎక్కువ వెచ్చించాలని భావిస్తున్నట్లు టెస్లా గత నెలలో వెల్లడించటం గమనార్హం. కంపెనీ ఏప్రిల్‌లో దాని ప్రస్తుత తయారీ కేంద్రాలను కొత్త ఉత్పత్తులు, మోడళ్లకు వినియోగించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications