భారతీయులకు నిరాశ: అమెరికా EB-5 ఇమిగ్రేషన్ వీసాల జారీపై అక్టోబర్ వరకు బ్రేక్!
అమెరికాలో పెట్టుబడులు పెట్టి త్వరగా గ్రీన్ కార్డ్ (Green Card) సంపాదించాలనుకునే భారతీయ ధనవంతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (FY 2026) గానూ భారతీయులకు కేటాయించిన ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ (EB-5) అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ ఇమిగ్రేషన్ వీసాల కోటా పూర్తిగా ముగిసిపోయింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 5వ తేదీ నాటికే ఈ కోటా పరిమితి దాటిపోవడంతో, అక్టోబర్ వరకు భారతీయులకు ఈ కేటగిరీ కింద కొత్తగా ఎలాంటి visa లు జారీ చేయబోమని స్పష్టం చేసింది.

అసలు ఏంటి ఈ EB-5 వీసా ప్రోగ్రామ్?
అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ లేదా గ్రీన్ కార్డ్ పొందడానికి అత్యంత వేగవంతమైన మార్గంగా ఈ EB-5 వీసాను పరిగణిస్తారు. దీనిని 'ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్' అని కూడా పిలుస్తారు. ఈ చట్టం ప్రకారం.. విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలోని ఒక కమర్షియల్ బిజినెస్‌లో కనీసం 8 లక్షల డాలర్లు (టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా లేదా గ్రామీణ ప్రాంతాల్లో) లేదా ఇతర ప్రాంతాల్లో అయితే 10.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.8.7 కోట్ల నుండి రూ.9 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలి. దీనితో పాటు అమెరికా పౌరులకు కనీసం 10 పూర్తికాల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది.
అయితే, అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టం (INA) ప్రకారం.. ప్రతి ఏటా ఏ ఒక్క దేశానికి కూడా మొత్తం ఉపాధి ఆధారిత వీసాలలో 7 శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన (Per-country cap) ఉంది. భారత్ నుండి ఈ వీసాకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో, ఈ ఏడాది జూన్ లోనే కోటా పూర్తిగా అయిపోయింది.
ట్రంప్ కొత్త గ్రీన్ కార్డ్ మెమోతో మారిన రూల్స్!
ఈ వీసా కోటా ముగియడానికి కొన్ని రోజుల ముందే, అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ఒక వివాదాస్పద పాలసీ మెమోరాండం విడుదల చేసింది. ట్రంప్ పరిపాలనలోని ఈ కొత్త రూల్ ప్రకారం.. ప్రస్తుతం తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఎవరైనా సరే, గ్రీన్ కార్డ్ (AOS - అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్) కోసం అప్లై చేయాలంటే మొదట తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిని "చట్టం యొక్క అసలు ఉద్దేశ్యానికి పునరాగమనం" అని యూఎస్ ప్రభుత్వం పేర్కొంది.
అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే (Economic benefit) ప్రొఫైల్స్ ఉన్నవారికి మినహాయింపులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ, దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
ఈ హఠాత్తు పరిణామాలపై ఇమిగ్రేషన్ నిపుణులు స్పందిస్తూ.. EB-5 ఇన్వెస్టర్లు చాలా కఠినమైన నిబంధనలను దాటుకుని వస్తారని, వారి పెట్టుబడులు అమెరికాలో ఉద్యోగాలను సృష్టిస్తాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి యూఎస్ లోని ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా తమ క్లయింట్ల ఆర్థిక ప్రొఫైల్స్ పక్కాగా ఉండేలా చూసుకోవాలని లా ఫర్మ్స్ భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వీసాల జారీ నిలిచిపోయినా, అక్టోబర్ 1, 2026 న అమెరికా కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2027) ప్రారంభం కాగానే ఈ వార్షిక పరిమితి మళ్లీ రీసెట్ అవుతుంది. అప్పటివరకు భారతీయ ఇన్వెస్టర్లు వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications