అమెరికాలో చదువు కోసం రూ.40 లక్షల లోన్.. 2 వేల ఇంటర్యూలకు వెళ్లినా దొరకని ఉద్యోగం.. చివరకు ఏమైందంటే..
అమెరికాలో ఉన్నత చదివులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే కలలు ఎంతోమంది భారతీయ యువతలో ఉంటాయి. US లో చదువుకుంటే జీవితం మారిపోతుంది అనే మాటలు మామలు, అత్తలు, బంధువుల నుంచి తరచుగా వినిపిస్తాయి. ఐటీ రంగంలో పనిచేస్తే శరవేగంగా ఎదగొచ్చని అందరూ నమ్ముతారు. కానీ కొన్నిసార్లు నిజ జీవితం కలలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇటీవల Reddit లో వైరల్ అయిన ఒక కథ దీనికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది.
u/MHDMAB అనే ఆన్‌లైన్ యూజర్ తన చేదు అనుభవాన్ని r/DevelopersIndia subreddit లో పంచుకున్నాడు. మే 2025లో అమెరికాలో Management Information Systems లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆతను.. అక్కడే మంచి అవకాశాలు దొరుకుతాయని భావించాడు. కానీ వాస్తవం మాత్రం పూర్తి విరుద్ధంగా జరిగింది. 2 వేలకు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినప్పటికీ, ఒక్కటి కూడా సరిగ్గా ఫలితం ఇవ్వలేదు.

ఆయన చేసిన ప్రయత్నాలలో జాబ్ అప్లికేషన్లు, రిఫరల్స్, నెట్‌వర్కింగ్, రిక్రూటర్లతో మాట్లాడటం, కోల్డ్ ఇమెయిల్స్ పంపటం అన్నీ ఉన్నాయి. కొన్ని పెద్ద కంపెనీల నుంచి ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్కటీ ఫైనల్ ఆఫర్ వరకు సాగలేదు. కాలక్రమేణా, అమెరికాలో వలస వచ్చిన విద్యార్థులకు (ముఖ్యంగా OPT వీసా ఉన్నవారికి) పరిస్థితి కఠినంగా మారిపోయింది. ఇంటర్వ్యూ కాల్స్ తగ్గుతూ చివరికి దాదాపు పూర్తిగా ఆగిపోయాయని అతని ద్వారా తెలుస్తోంది.
చివరికి ఉపాధి పొందాలని, ఉత్పాదకంగా ఉండాలని డేటా అనలిస్ట్ పాత్రలో ఒక కాంట్రాక్ట్ జాబ్ పొందాడు. కానీ అది తన నైపుణ్యాలు, లక్ష్యాలకు సరిపోరని త్వరగా గ్రహించాడు. ఆయన కోరుకున్న సాంకేతిక సవాళ్లు, నేర్చుకునే అవకాశాలు అక్కడ లేవు. ఇష్టంలేని పనిలో కొనసాగడం, భవిష్యత్ పై భయం, అమెరికాలో కలలు కూలిపోతున్న అనుభూతి ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి.
అతని జీవితం మరింత భారంగా మారడానికి కారణం రూ.40 లక్షల విద్యారుణం. విదేశాల్లో చదివే విద్యార్థుల్లో చాలామందిలాగే, ఆయన కూడా చదువు కోసం భారీ రుణం తీసుకున్నాడు. ఇప్పుడు ఉద్యోగం లేకపోవడం వల్ల ఆ రుణం తిరిగి చెల్లించడం అసాధ్యమైన సవాలుగా మారింది. భారత్‌కి వెళ్లిన తర్వాత జీతం వచ్చినా, ఆ లోన్ కట్టడం చాలా కష్టమని ఆయన అంగీకరించాడు. భారతీయ రిక్రూటర్లు కూడా US డిగ్రీకి పూర్తి సమయం అనుభవం లేకపోతే విలువ ఇవ్వకుండా ఉంటారని ఆయన వాపోయాడు.
చాలా ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, భవిష్యత్తు పై భయాల తర్వాత చివరకు ఆయన ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా కలను వదిలిపెట్టి బెంగళూరుకు తిరిగి వచ్చాడు.ఇప్పుడు కొత్త దృష్టితో, కొత్త ఆశతో మళ్లీ ఉద్యోగ వేటను ప్రారంభించాడు. ప్రస్తుతానికి SDE లేదా Analyst రోల్స్కోసం చూస్తున్నాడు.
ఈ కథను చదివేవారిలో ఎవరైనా జాబ్ రిఫరల్ ఇవ్వగలిగితే, ఏదైనా సలహా చెప్పగలిగితే లేదా అవకాశాలు తెలిసిన వారు ఉంటే, మీ సహాయం నాకు చాలా విలువైనదని ఆయన చివరిగా రాసుకొచ్చాడు. ఈ నిజ జీవితపు ప్రయాణం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. విదేశాల్లో జీవితం ఎంత అందంగా కనిపించినా, దాని వెనుక చాలా కఠినమైన వాస్తవాలు దాగి ఉంటాయి. చాలా మంది చేసినట్లే, ఈ ఉద్యోగి కూడా మళ్లీ మొదటినుంచి తన భవిష్యత్తును నిర్మించుకోవాలి ఇప్పుడు. ఈ కథ అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లే భారతీయుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.


Click it and Unblock the Notifications