US Dollar: అనేక దశాబ్దాలుగా అమెరికా తన పెత్తనాన్ని ప్రపంచ దేశాలపై కొనసాగించటానికి ఒక కీలక కారణం డాలర్. దీనిని బైపాస్ చేయాలని గతంలో కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలను యూఎస్ నిలువరించగలిగింది.
ప్రపంచ పెద్దన్నగా ఉండటానికి మారక కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్‌ది అగ్రపాత్రనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డి-డాలరైజేషన్ ధోరణి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. ఇది వాషింగ్టన్ స్వయంగా సృష్టించిన పరిస్థితని చెప్పవచ్చు. భారత్ సైతం డాలర్ పేమెంట్లను బైపాస్ చేయాలని గత కొంత కాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో డాలర్ పై ఆధారపడటం తగ్గనుంది. కరెన్సీ అస్థిరతను కూడా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

US డాలర్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా దేశాలను బలవంతం చేసే పరిస్థితులను వాషింగ్టన్ సృష్టించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)లోని రష్యా ప్రతినిధి అలెక్సీ మోజిన్ అన్నారు. ఇప్పటికే ఇరానియన్లు, బ్రెజిలియన్లు, సౌదీలు ఇప్పటికే చైనాతో మాత్రమే కాకుండా.. ఇతర దేశాలతో కూడా యువాన్‌లో వాణిజ్య చెల్లింపులు చేస్తున్నాయి. అమెరికా డాలర్లను జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక బాధ్యతల కోసం ఉపయోగిస్తోంది. ఇది ఒక దేశానికి చెందినది.. అలా అని అందరూ దీనినే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఉపయోగించాలనటం తప్పని అనేక దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

దశాబ్దాలుగా అంతర్జాతీయ చెల్లింపుల్లో పాతుకుపోయిన అమెరికా డాలర్ గ్లోబల్ దేశాల మధ్య చెల్లింపులు, ఫారెక్స్ నిల్వల రూపంలో డిపాజిట్లను కలిగి ఉంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా దాని ప్రాబల్యం ఏర్పడింది. కానీ ఇప్పుడు దానికి చెల్లు చీటీ పడుతోంది. ఇరాన్, బ్రెజిల్, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ జాతీయ కరెన్సీలను వాణిజ్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి లేదా చైనా కరెన్సీని వినియోగిస్తున్నాయి. అయితే సెంట్రల్ బ్యాంకుల వార్షిక సర్వే ప్రకారం.. డాలర్ రానున్న దశాబ్దంలో ప్రపంచంలోని ఆధిపత్య రిజర్వ్ కరెన్సీగా దాని స్థానాన్ని కొనసాగించవచ్చని భావిస్తున్నారు .


Click it and Unblock the Notifications