MDH Masala: మసాలాల్లో టైఫాయిడ్ బ్యాక్టీరియా..!! MDH ఉత్పత్తులను అమెరికా తిరస్కరణ..
Typhoid Bacteria: ప్రస్తుతం భారతీయ ప్రముఖ మసాలా పొడి ఉత్పత్తి సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నాణ్యతాపరమైన లోపాలు ఉన్నట్లు ఇతర దేశాల్లోని అధికారులు ప్రశ్నలు లేవెత్తుతున్న వేళ సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా నుంచి సైతం దీనికి సంబంధించిన కీలక విషయాలు వెలువడ్డాయి.
యూఎస్ కస్టమ్స్ అధికారులు సాల్మొనెల్లా కారణంగా గడచిన 6 నెలల్లో MDH ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎగుమతి చేసిన అన్ని మసాలా-సంబంధిత ఎగుమతుల్లో 31 శాతం తిరస్కరణకు గురైనట్లు వెల్లడైంది. గత ఏడాది అమెరికాకు MDH మసాలా సంస్థ పంపిన అన్ని సరుకుల కోసం తిరస్కరణ రేటు అక్టోబర్ 2023 నాటికి 15 శాతం నుంచి ప్రస్తుతం రెండింతలకు పెరిగింది. ఇటీవలి నెలల్లో సాల్మొనెల్లా కాలుష్యం కారణంగా తిరస్కరణ రేట్లు పెరిగిన తరుణంలో.. సింగపూర్, హాంకాంగ్ రెండూ సుగంధ ద్రవ్యాలలో క్యాన్సర్ కారక పురుగుమందులు ఉన్నట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో MDH, ఎవరెస్ట్ ఉత్పత్తుల అమ్మకాలను అక్కడి అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక అమెరికా విషయంలో అక్టోబర్ 2023 నాటికి మొత్తం MDH షిప్‌మెంట్‌లలో దాదాపు మూడింట ఒక వంతు లేదా 11 షిప్‌మెంట్‌లను యూఎస్ తిరస్కరించింది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం అక్టోబర్ 2022-సెప్టెంబర్ 2023 మధ్య తిరస్కరణ రేటు 15 శాతంగా ఉంది. దీనికి తోడు అక్టోబర్ 2020 నుంచి తిరస్కరించబడిన అన్ని MDH ఉత్పత్తుల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమయ్యాయి.
ఏదైనా ఆహార పదార్ధంలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉన్నట్లయితే.. అది తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు. సరిగ్గా ఉడికించకపోతే ఇది ప్రేగులకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా టైఫాయిడ్‌కు కారణమవుతుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా గుడ్లు, గొడ్డు మాంసం, పచ్చి చికెన్, పండ్లు, కూరగాయలు.. జంతువులలో అలాగే మానవుల ప్రేగులలో కనిపిస్తుంది. FDA జనవరి 2022లో MDH తయారీ యూనిట్‌ని తనిఖీ చేయగా ఆ సమయంలో యూనిట్‌లో సరైన పారిశుద్ధ్య సదుపాయాలు లేవని గుర్తించింది. ఇక ఎవరెస్ట్ ఉత్పత్తుల ఎగుమతి తిరస్కరణలను అక్టోబర్ 2023- సెప్టెంబర్ 2024 వరకు గమనిస్తే కేవలం 0.3 శాతంగా ఉన్నట్లు యూఎస్ డేటా ప్రకారం వెల్లడైంది. తిరస్కరణలు ప్రాథమికంగా లేబులింగ్-సంబంధిత ఉల్లంఘనలపై ఉన్నాయి.


Click it and Unblock the Notifications