US Markets Crash: అమెరికాకు చెందిన అతిపెద్ద చిప్ తయారీదారు ఎన్వీడియా గత ఏడాది ఒక్క రోజునే భారీగా లాభపడి వాల్ స్ట్రీట్ లో కొత్త చరిత్రను సృష్టించింది. అయితే ప్రస్తుతం ఇదే కంపెనీ ఒక్క రోజులో భారీ పతనాన్ని చూస్తూ మరో సారి చరిత్రలోకి ఎక్కింది.
సోమవారం అమెరికా మార్కెట్లలో ఎన్వీడియా షేర్లను విక్రయించటానికి పెట్టుబడిదారులు పోటీ పడటంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో ఏకంగా 600 బిలియన్ డాలర్ల మేర తుడుకుపోయింది. వాస్తవానికి ఇంత భారీ స్థాయిలో కంపెనీ షేర్ల పతనానికి కారణం చైనీస్ ఏఐ యాప్ డీప్‌సీక్ కారణంగా తెలుస్తోంది. అమెరికా మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా సోమవారం చెత్త పనితీరును కనబరిచాయి. ఈ క్రమంలో ఎన్వీడియా స్టాక్ ధర ఇంట్రాడేలో 18 శాతం మేర క్షీణతను చూసి కనిష్ఠంగా 116.70 డాలర్లకు దిగజారింది.

అయితే మార్కెట్ల ముగింపు సమయంలో ఎన్వీడియా స్టాక్ ధర ఒక్కోటి 118.58 స్థాయికి చేరుకోగా కంపెనీ మార్కెట్ క్యాప్ 592.74 బిలియన్ డాలర్ల మేర ఆవిరైపోయింది. విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనైన కంపెనీ తన మూడు ట్రిలియన్ డాలర్ల మార్కును విలువ విషయంలో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం ఎన్వీడియా మార్కెట్ క్యాప్ 2.9 ట్రిలియన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో విలువైన కంపెనీల జాబితాలో ఎన్వీడియా మైక్రోసాఫ్ట్, ఆపిల్ తర్వాతి స్థానానికి పడిపోయింది.
అసలు ఎన్వీడియా స్టాక్ పతనానికి కారణం..?
చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రజాదరణ పొందడం వల్ల సోమవారం పెట్టుబడిదారులు ఎన్విడియాపై విశ్వాసం కోల్పోయారు. ఎన్వీడియాకు డీప్‌సీక్ పెద్ద పోటీదారుగా మారుతుందనే వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. తక్కువ సమయంలో అలాగే తక్కువ పెట్టుబడితో డీప్సీక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధి చేసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పోటీ రానున్న రోజుల్లో కంపెనీకి పెద్ద దెబ్బను కలిగిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
పెద్ద ఎత్తున దాడి కారణంగా తమ సేవను కొంతకాలం తగ్గించుకున్నట్లు చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్‌సీక్ సోమవారం ప్రకటించింది. దీంతో చైనా స్టార్టప్ తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను పరిమితం చేసిందని, చైనా ప్రధాన భూభాగంలో మొబైల్ ఫోన్ నంబర్ ఉన్న వినియోగదారులను మాత్రమే నమోదు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే ఉన్న వినియోగదారులు యథావిధిగా లాగిన్ అవ్వగలరని స్టార్టప్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్వీడియా-డీప్సీక్ మధ్య పెద్ద పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications