మళ్లీ టారిఫ్ బాదుడు మొదలు పెట్టిన ట్రంప్.. ఇరాన్‌తో పాటు చైనా అంతు కూడా చూస్తామని సంచలన ప్రకటన..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచంలోని అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బీజింగ్ కనుక ఇరాన్‌కు సైనికపరమైన సహాయం అందిస్తే.. అమెరికాలోకి దిగుమతి అయ్యే చైనా వస్తువులపై 50 శాతం వరకు భారీ సుంకాలను విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అటువంటి చర్యలకు పాల్పడుతూ పట్టుబడితే వారు భారీ ఆర్థిక మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ప్రస్తుతం పశ్చిమాసియాలో అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత బలహీనంగా ఉంది. ఈ తరుణంలో ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని, ముఖ్యంగా వాయు రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

సిఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. రాబోయే వారాల్లో చైనా నుంచి ఇరాన్‌కు విమాన విధ్వంసక క్షిపణులు (MANPADS) వంటి అత్యాధునిక ఆయుధాలు సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఈ ఆయుధాలు తక్కువ ఎత్తులో ఎగిరే అమెరికా యుద్ధ విమానాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే.. ఈ సరఫరా యుద్ధ గమనాన్నే మార్చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ కేవలం ఆర్థికపరమైన హెచ్చరికలతోనే ఆగలేదు. ఇరాన్ విషయంలో తన దూకుడును మరింత పెంచారు.
ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే.. ఒక్క రోజులోనే ఇరాన్‌ను నాశనం చేయగల సామర్థ్యం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలు, పౌర ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని, వాటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఎటువంటి పురోగతి సాధించకపోవడం, యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
వచ్చే నెలలో ట్రంప్.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల కోసం బీజింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పర్యటనకు ముందే ఇరాన్ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక పోటీని మరింత తీవ్రం చేశాయి. చైనా ఆయుధ సరఫరా చేపడితే అది "పెద్ద సమస్యలకు" దారితీస్తుందని ఆయన పదేపదే నొక్కి చెప్పారు. ఇరాన్ ఈ విరామ సమయాన్ని కేవలం రక్షణ కోసం కాకుండా, యుద్ధం తీవ్రతరం చేసేలా సన్నాహాలు చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.
ఏదేమైనా పశ్చిమాసియా యుద్ధం కేవలం ప్రాంతీయ పోరాటం నుండి ప్రపంచ స్థాయి వాణిజ్య, సైనిక యుద్ధంగా మారుతోంది. చైనా, అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఈ భౌగోళిక రాజకీయ ఒత్తిడి అంతర్జాతీయ మార్కెట్లను, దౌత్య సంబంధాలను, ప్రపంచ శాంతిని తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉంది. ఒకవైపు వాణిజ్య యుద్ధం, మరోవైపు ప్రత్యక్ష సైనిక చర్యల హెచ్చరికల మధ్య రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. తాజాగా Trump చేసిన ఈ ప్రకటనతో అగ్రరాజ్యాల మధ్య సంబంధాలు మరింత క్లిష్టతరంగా మారాయి.


Click it and Unblock the Notifications