ట్రంప్ దెబ్బకు లొంగిన చైనా.. ఏటా రూ. 1.4 లక్షల కోట్ల డీల్! అసలేం జరిగిందంటే?
అంతర్జాతీయ వ్యాపార రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald trump) తనదైన శైలిలో సంచలనాలు సృష్టిస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో గత వారం జరిగిన కీలక సమావేశాల తర్వాత, వైట్ హౌస్ ఒక కీలకమైన ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం, అమెరికా నుంచి ఏటా కనీసం 17 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఈ కొనుగోళ్లు నిరంతరాయంగా సాగుతాయని వైట్ హౌస్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే, గత ఏడాది అక్టోబర్ 2025లో సోయాబీన్ కొనుగోలు కోసం చైనా చేసుకున్న ఒప్పందాలు దీనికి అదనం కావడం విశేషం.

చికెన్, బీఫ్ దిగుమతులపై ఆంక్షల సడలింపు
గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం) కారణంగా అమెరికా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒకరిపై ఒకరు భారీగా టారిఫ్‌లు (పన్నులు) విధించుకోవడంతో, అమెరికా నుంచి చైనాకు జరిగే వ్యవసాయ ఎగుమతులు 2025 నాటికి 65.7 శాతం పడిపోయి, కేవలం 8.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ట్రంప్ (trump) తన మొదటి విడత అధ్యక్ష కాలంలో చూపించిన దూకుడు వల్ల, చైనా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడటం బాగా తగ్గించేసింది. ఉదాహరణకు 2016లో చైనా తన సోయాబీన్ అవసరాల కోసం 41 శాతం అమెరికాపై ఆధారపడితే, 2024 నాటికి అది 20 శాతానికి పడిపోయింది.
కానీ ఇప్పుడు ట్రంప్ (trump) మళ్లీ పట్టుబట్టడంతో, చైనా ఒకడుగు వెనక్కి వేసింది. అమెరికా బీఫ్ (గోమాంసం) కంపెనీలపై ఉన్న సస్పెన్షన్లను ఎత్తివేయడానికి, అలాగే బర్డ్ ఫ్లూ లేని అమెరికా రాష్ట్రాల నుంచి చికెన్ (కోడిమాంసం) దిగుమతులను మళ్లీ ప్రారంభించడానికి చైనా అధికారులు అంగీకరించారు.
కొత్తగా 'ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డులు'
ఈ ఒప్పందాలను పక్కాగా అమలు చేయడం కోసం ప్రపంచంలోని ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పని చేయనున్నాయి. ఇందులో భాగంగా 'యూఎస్-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్' , 'యూఎస్-చైనా ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్' అనే రెండు కొత్త బోర్డులను ఏర్పాటు చేయబోతున్నట్లు వైట్ హౌస్ ఆదివారం ధృవీకరించింది. పరస్పరం పన్నులు తగ్గించుకునే ఫ్రేమ్‌వర్క్ కింద మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించుకోవడానికి, వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఈ బోర్డులు ఉపయోగపడతాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ఏదేమైనా ట్రంప్ రీ-ఎంట్రీ తర్వాత చైనాని ఇంత పెద్ద డీల్‌కు ఒప్పించడం అమెరికా రైతులకు పెద్ద ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.
ట్రంప్ వ్యూహం ఫలించినట్లేనా?
ఈ భారీ ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా వ్యవసాయ రంగానికి మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చైనాతో వచ్చిన విభేదాల వల్ల తీవ్ర నష్టాలు చవిచూసిన యూఎస్ రైతులకు ఈ సరికొత్త వాణిజ్య బోర్డుల ఏర్పాటు ఒక భరోసాని ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో గ్లోబల్ ట్రేడ్‌పై డొనాల్డ్ ట్రంప్ మరిన్ని ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications