Byju's: దేశంలో డిజిటల్ ఎడ్‌టెక్ రంగాన్ని కరోనా విస్తృతం చేసింది. అదే సమయంలో ఈ రంగంలోకి అనేక కంపెనీలు అరంగేట్రం చేశాయి. ఆ సమయంలో స్టార్టప్ కంపెనీగా ఉన్న బైజూస్ వేగవంతమైన వృద్ధిని సాధించింది.
అయితే ఇప్పుడు ఈ కంపెనీ వ్యాల్యుయేషన్ ను పెట్టుబడి సంస్థలు భారీగా తగ్గిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత పెట్టుబడి నిర్వహణ సంస్థ బ్లాక్‌రాక్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్ BYJU విలువను 62 శాతం దగ్గించింది. దీనికి ముందు అక్టోబర్ 2022లో సైతం విలువను తగ్గించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బ్లాక్ రాక్ సంస్థ తన వాటాలను విక్రయించినట్లు తాజా స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. ఏప్రిల్‌లో బ్లాక్‌రాక్ BYJU స్టార్టప్ విలువను 22 బిలియన్ డాలర్ల నుంచి 11.5 బిలియన్ డాలర్లకు కుదించింది. అంటే దాదాపు కంపెనీ విలువను 50 శాతం మేర తగ్గించింది. ఇటీవల 250 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేసిన బైజూస్ ఆ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.
పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం బైజూస్ సంస్థ తాజాగా రూ.5,750 కోట్ల (700 మిలియన్ డాలర్లు)నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో 250 మిలియన్ డాలర్లను గతంలో ఉన్న పెట్టుబడిదారులు, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి సేకరించిందని తెలుస్తోంది. ఫండ్ వింటర్ కారణంగా నష్టాలను తగ్గించుకునే పనిలో కంపెనీ అనేక మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఎడ్టెక్ స్టార్టప్ ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2011-2023 మధ్య కాలంలో కంపెనీ ఎఫ్‌డిఐల రూపంలో పొందిన రూ.28 వేల కోట్లకు సంబంధించి కంపెనీని పరిశీలిస్తున్నారు. ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో కంపెనీ రూ.9,754 కోట్లను వివిధ విదేశీ అధికార పరిధికి పంపిందని ఏజెన్సీ తెలిపింది. అయితే వీటిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం తాము అధికారులకు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications