ఎయిర్‌టెల్ డేటా సెంటర్‌లో అమెరికా కంపెనీ భారీ పెట్టుబడి
భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన డేటా సెంటర్ వ్యాపారం ఎన్ఎక్స్‌ట్రా డేటా లిమిటెడ్‌లో అమెరికా కార్లైల్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. 235 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఇందులో 25 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఎన్ఎక్స్‌ట్రా ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యుయేషన్ 1.2 బిలియన్ డాలర్ల వద్ద కార్లైల్ గ్రూప్ ఇరవై ఐదు శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఎయిర్ టెల్ తన వద్ద 75 శాతం అట్టిపెట్టుకుంటుంది.

భారత్ నిబంధనలకు అనుగుణంగా..
భారత్‌లోని రెగ్యులేటరీ నిబంధనలకు, ఆమోదానికి అనుగుణంగా ట్రాన్సాక్షన్స్ ఉంటాయని, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియంత్రణ ఆమోదాలకు అనుగుణంగా ఈ ఒప్పందం ఉంటుందని తెలిపాయి. ఎన్ఎక్స్‌ట్రా డేటా సెంటర్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇక్కడి నుండి భారత్, ప్రపంచ సంస్థలకు, స్టార్టప్స్, ఎస్ఎంఈలకు సేవలు అందిస్తోంది. ఎన్ఎక్స్‌ట్రాకు దేశవ్యాప్తంగా 10 పెద్ద డేటా సెంటర్లు ఉన్నాయి. 120 అదనపు డేటా సెంటర్లతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి.

ఎవరేమన్నారు..
భారత్‌లో వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని, ఈ ప్రయాణంలో కార్లైల్ ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నందుకు ఆనందంగా ఉందని, ఈ రంగంలో వారికి ఉన్న అనుభవం వల్ల వారితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని భారతీ ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ అన్నారు.
కార్లైల్ ఆసియా పార్ట్‌నర్స్ అడ్వైజరీ టీం మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. డిజిటల్ సేవల పరంగా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు.

మౌలిక సదుపాయాల కోసం..
అమెరికాకు చెందిన కార్లైల్ గ్రూప్‌కు ఈ రంగంలో మంచి అనుభవం ఉంది. ఇది అమెరికాలోని కోర్‌సైట్, స్పెయిన్‌లోని ఇట్కోనిక్‌లో పెట్టుబడులు పెట్టింది. ఎన్ఎక్స్‌ట్రా దేశంలో మల్టిపుల్ లార్జ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తాన్ని మొలిస సదుపాయాలు పెంచేందుకు ఉపయోగించనుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియోతో మైక్రోసాఫ్ట్ జత కట్టింది.


Click it and Unblock the Notifications