Trump News: ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా వచ్చిన డొనార్డ్ ట్రంప్ కొత్త జవసత్వాలు నింపే పనిలో ఉన్నారు. అమెరికాను తిరుగులేని శక్తిగా మార్చటంతో పాటు యూఎస్ తన మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయటం ద్వారా అమెరికన్లకు ఉపాధిని కల్పించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ట్రంప్ ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో అమెరికాపై పన్నులు వేసి ప్రతి దేశంపై తిరిగి పన్నులు వేస్తామని ఒక్క మాటలో తెలిపారు. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ఇండియా అమెరికా నుంచి దిగుమతులపై అత్యధికంగా పన్నులు విధిస్తోందని తన మదిలోని మాటను బయటపెట్టారు. వాస్తవానికి ఇది నిజమే. దీనికి ముందు మెక్సికో, కెనడాలపై 25 శాతం చొప్పున సుంకాలు ప్రకటించినప్పటికీ 30 రోజుల పాటు వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో చైనాపై మాత్రం ట్రంప్ సుంకాల మోత మోగించారు.

ఈ పన్నులు రానున్న కొద్ది వారాల్లో అమలులోకి రానున్న వేళ లండన్ బంగారు లాకర్ల నుండి అమెరికాకు టన్నుల కొద్ది గోల్డ్ వెనక్కి తీసుకోటం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. గత ఏడాది ఇండియా కూడా తన బంగారాన్ని లండన్ నుంచి వెనక్కి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం లాకర్లలో కలిగి ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి అమెరికా తన పసిడి నిల్వలను క్రమంగా తగ్గిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద దాదాపు 252 బిలియన్ డాలర్ల విలువైన వందల టన్నుల గోల్డ్ ఉన్న సంగతి తెలిసిందే.
కేవలం ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత లండన్ బ్యాంక్ నుంచి దాదాపు 8000 గోల్డ్ బార్స్ వెనక్కి తరలించబడటం గమనార్హం. బంగారం లండన్‌లో కంటే అమెరికాలో ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికే యూఎస్ బ్యాంకులు లండన్ నుంచి న్యూయార్క్ నగరానికి పెద్ద మొత్తంలో పసిడి నిల్వలను వెనక్కి తెచ్చుకుంటున్నాయని వినికిడి. అయితే వాస్తవానికి అధ్యక్షుడు ట్రంప్ యూరప్ దేశాలపై కూడా విదేశీ పాలసీ కింద సుంకాలను విధించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్న వేళ ఈ బంగారం తరలింపు జరిగిందని నిపుణులు చెబుతున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం అమెరికాకు తిరిగి తీసుకురాబడిన పసిడిలో ఎక్కువ భాగం జేపీ మోర్గన్, హెచ్ఎస్బీసీలు తీసుకొచ్చినవిగా తెలుస్తోంది. అమెరికా ప్రస్తుతం పెద్ద గ్లోబల్ ట్రేడ్ వార్ ముందు ఉన్న తరుణంలో ఈ చర్య వచ్చింది. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవటానికి సేఫ్ హెవెన్ గోల్డ్ నిల్వలు చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గోల్డ్ విక్రయాల ద్వారా నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం జరగవచ్చని వారు అంటున్నారు. సమాచారం ప్రకారం ప్రస్తుతం అమెరికా వద్ద 106 బిలియన్ డాలర్ల విలువైన పసిడి ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications