లక్ష రూపాయల జీతం.. అయినా ఇల్లు కొనలేని దుస్థితి.. కలగా మిగిలిపోతున్న మధ్యతరగతి ప్రజల సొంతింటి ఆశలు..
Urban Housing Crisis: భారతదేశంలో నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్తూ.. ఆర్థికంగా ఎగువ మధ్యతరగతి (Upper Middle Class) వర్గానికి చెందిన భార్యాభర్తలు కూడా ప్రధాన నగరాల్లో ఒక చిన్న ఇల్లు కొనుగోలు చేయలేని విచిత్రమైన, ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. గృహ ధరల విపరీతమైన పెరుగుదల, వేతనాల మందగమనం మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా పట్టణ భారతదేశంలో సొంత ఇల్లు అనేది క్రమంగా మధ్యతరగతి అందుబాటు పరిధి దాటిపోతోందని పరిశ్రమ నిపుణులు, మార్కెట్ డేటా హెచ్చరిస్తున్నాయి.
మ్యాజిక్‌బ్రిక్స్ (Magicbricks) తాజా గణాంకాల ప్రకారం.. ప్రధాన నగరాల్లో ఒక సాధారణ 1-BHK ఫ్లాట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నోయిడాలోని సెక్టార్ 19, గురుగ్రామ్‌లోని శాంతి నగర్‌లలో 1-BHK ధర దాదాపు రూ. 2 కోట్లుగా ఉంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రూ. 1.55 కోట్లు, ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఏకంగా రూ. 2.84 కోట్లకు ఈ ధరలు చేరాయి. నలుగురు సభ్యులున్న కుటుంబానికి 1-BHK ఇల్లు సరిపోకపోవడం ఒకెత్తయితే.. ఆ 1-BHKని కూడా కొనుగోలు చేయలేని స్థాయికి ధరలు చేరడం మధ్యతరగతి పడుతున్న పాట్లను స్పష్టం చేస్తోంది.

రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ 'నైట్ ఫ్రాంక్' అంచనా ప్రకారం.. పట్టణ భారతదేశంలో ప్రసుతం సుమారు 10 మిలియన్ల సరసమైన (Affordable) గృహాల కొరత ఉంది. జీతాల పెరుగుదల నెమ్మదిగా సాగుతుండగా.. నివాస గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) సూచీలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రాంట్ థోర్న్టన్ భారత్ పార్టనర్ చేతన్ చిచ్రా విశ్లేషిస్తూ.. ప్రస్తుత ఆస్తి ధరల వద్ద, ముఖ్యంగా ఎన్సీఆర్ (NCR) మార్కెట్లలో సొంత ఇల్లు కొనుగోలు చేయడం చాలా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు లేకుండా పోతోంది. కొనుగోలుదారుడి ఆదాయానికి, రుణం పొందే అర్హతకు మధ్య అంతరం భారీగా పెరిగింది" అని తెలిపారు.
ఫోర్టీసియా రియల్టీ బీడీఎం కేశవ్ మంగ్లా తెలిపిన లెక్కల ప్రకారం.. రూ. 1 కోటి విలువైన (చదరపు అడుగుకు రూ. 10,000) సాధారణ ఫ్లాట్‌ను 20% డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన 80% రుణం (రూ. 80 లక్షలు) తీసుకుంటే, 20 ఏళ్లకు 7.5%-8% వడ్డీ రేటు ప్రకారం నెలవారీ ఈఎంఐ (EMI) రూ. 64,500 నుంచి రూ. 66,900 వరకు ఉంటుంది. బ్యాంకుల నియమం ప్రకారం ఈఎంఐ ఆదాయంలో 35% మాత్రమే ఉండాలి అంటే ఆ కుటుంబ నెలవారీ నికర ఆదాయం రూ. 1.85 లక్షల నుంచి రూ. 1.91 లక్షలు ఉండాలి. కానీ నోయిడా, ముంబై, బెంగళూరు, గురుగ్రామ్‌లలో ఒక చిన్న ఇంటి ధర రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉంటోంది. నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించే కుటుంబానికి స్కూల్ ఫీజులు, కిరాణా, వైద్య ఖర్చులు పోనూ రూ. 60,000 పైగా ఈఎంఐ చెల్లించడం కష్టసాధ్యంగా మారింది.
మరోవైపు బిల్డర్లు సరసమైన గృహాల నిర్మాణాన్నే నిలిపివేస్తున్నారు. 'అనరాక్' (ANAROCK) డేటా ప్రకారం.. 2020లో ప్రారంభమైన కొత్త గృహాలలో రూ. 40 లక్షలలోపు ఇళ్ల వాటా 30% ఉండగా.. 2025 నాటికి అది 14 శాతానికి పడిపోయింది. రూ. 40-80 లక్షల విభాగం కూడా 40% నుండి 20%కి క్షీణించింది. అదే సమయంలో రూ. 2.5 కోట్లకు పైబడిన లగ్జరీ ఇళ్ల నిర్మాణం 3% నుంచి 20%కి పెరిగింది. భూమి, నిర్మాణం, ఫైనాన్సింగ్ వ్యయాలు పెరగడంతో చౌక ఇళ్ల నిర్మాణం వాణిజ్యపరంగా లాభదాయకం కాదని డెవలపర్లు పేర్కొంటున్నారు.
అధికారికంగా రూ. 45 లక్షల లోపు ఉన్న ఇంటిని 'సరసమైన గృహం'గా పరిగణిస్తుండగా, ఆ ధర పరిమితిని రూ. 1 కోటికి పెంచాలని పరిశ్రమ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. అయితే "నిర్వచనాన్ని మార్చినంత మాత్రాన, ఆ ఇల్లు కొనుగోలుదారుడికి చౌకగా మారదు" అని చిచ్రా నిర్మొహమాటంగా స్పష్టం చేశారు.
తీర్థ్ రియల్టీస్ డైరెక్టర్ విజయ్ రౌండల్ ప్రకారం.. ఈ సమస్యకు పరిష్కారంగా నగరాల సరిహద్దులు దాటి నూతన సబర్బన్ నివాస ప్రాంతాల విస్తరణ జరగాలి. అయితే మెట్రోలు, మెరుగైన రహదారులు వంటి మౌలిక సదుపాయాలు లేకుండా కేవలం నగరానికి దూరంగా చౌకగా ఇల్లు దొరికినప్పటికీ, రోజువారీ ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరిగి కుటుంబాలకు మరింత భారమవుతుందని ఆయన తెలిపారు. సరైన జోక్యం చేసుకోకపోతే 2030 నాటికి గృహాల కొరత 30 మిలియన్లకు పెరిగే ప్రమాదం ఉందని నైట్ ఫ్రాంక్ హెచ్చరిస్తోంది. నెలకు లక్ష కంటే తక్కువ సంపాదించే వారికి పట్టణాల్లో సొంత ఇల్లు ఒక అసాధ్యమైన కలగానే మిగిలిపోయే ముప్పు పొంచి ఉంది.


Click it and Unblock the Notifications
