Uranium: ఒక్క అణుబాంబుకు ఎన్ని కేజీల యురేనియం కావాలి? ఇరాన్ దగ్గర ఉన్నది ఎంత?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రధాన చర్చ యురేనియం (Uranium). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ మధ్య జరుగుతున్న వాగ్వాదాలు ఈ అణు ఇంధనం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇరాన్ తన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ దానిని వెంటనే ఖండించింది. ఈ నేపథ్యంలో, అసలు యురేనియం అంటే ఏంటి? అది ఎలా అణుబాంబుగా మారుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

యురేనియం ఎన్ రిచ్‌మెంట్ (Enrichment) అంటే ఏమిటి?
ప్రకృతిలో దొరికే యురేనియం నేరుగా అణు రియాక్టర్లలో లేదా బాంబుల్లో వాడలేము. అందులో ఉండే 'యురేనియం-235' అనే ఐసోటోప్ శాతాన్ని పెంచాలి. దీనినే 'ఎన్ రిచ్‌మెంట్' అంటారు. కేవలం 3 నుంచి 5 శాతం వరకు ఎన్ రిచ్ చేసిన యురేనియం విద్యుత్ ఉత్పత్తికి (సివిల్ అవసరాలకు) సరిపోతుంది. కానీ, ఇది 20 శాతం దాటితే అది ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నట్లు లెక్క. ఒకసారి 90 శాతానికి చేరుకుంటే, దానిని 'వెపన్స్ గ్రేడ్' యురేనియం అంటారు, అంటే దీనితో అణు బాంబులు తయారు చేయవచ్చు.
ఒక్క బాంబు తయారు చేయడానికి ఎంత కావాలి?
అణు నిపుణుల లెక్కల ప్రకారం, 90 శాతం స్వచ్ఛత కలిగిన 25 కిలోల యురేనియం ఉంటే ఒక శక్తివంతమైన అణు బాంబును తయారు చేయవచ్చు. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. ఇరాన్ ప్రస్తుతం 60 శాతం వరకు ఎన్ రిచ్ చేసిన యురేనియంను దాదాపు 400 నుండి 450 కిలోల వరకు నిల్వ చేసిందని సమాచారం. 60 శాతం నుండి 90 శాతానికి చేరుకోవడం చాలా వేగంగా జరిగిపోయే ప్రక్రియ. అంటే, ఇరాన్ అనుకుంటే అతి తక్కువ కాలంలోనే ఒకటి కాదు, ఏకంగా పదుల సంఖ్యలో అణుబాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించింది.
అమెరికా ఆందోళనకు కారణం ఇదే!
అమెరికా భయం ఏంటంటే, ఇరాన్ దగ్గర ఉన్న ఈ నిల్వలు పెరిగే కొద్దీ, వారు అణుబాంబును సిద్ధం చేసే సమయం (Breakout Time) తగ్గిపోతుంది. ఇరాన్ కు ఈ నిల్వలు ఒక రాజకీయ ఆయుధంగా మారాయి. వీటిని చూపించి అమెరికా నుండి ఆర్థిక రాయితీలు పొందాలని ఇరాన్ భావిస్తోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణ కూడా ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉండటంతో, ఇరాన్ రహస్యంగా అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రపంచ శాంతికి ముప్పు?
ఏదేమైనా యురేనియం (Uranium) అనేది కేవలం ఒక మూలకం మాత్రమే కాదు, అది ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను శాసించే శక్తిగా మారింది. అమెరికా , ఇరాన్ మధ్య చర్చలు విఫలమైతే, అది మధ్య ప్రాచ్యంలో పెను సంక్షోభానికి దారితీసే అవకాశం కూడా ఉంది. అణు ఆయుధాల పోటీ పెరిగితే ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ యురేనియం నిల్వలపై ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదరడం ఇప్పుడు ఎంతో అవసరం. మరి ఆ అడుగులు ఏ దిశగా పడతాయో చూడాలి.


Click it and Unblock the Notifications