UPS recruitment: లక్షల్లో ఉద్యోగాలు, భారీగా జీతాలు.. కానీ ఉబెర్ దెబ్బతో..
UPS recruitment: ఈ మధ్య సీజనల్ ఉద్యోగులను నియమించుకునే ట్రెండ్ నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్, మీషో వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ లక్షల కొద్దీ సీజనల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. తాజాగా మరో కొరియర్ కంపెనీ ఇదే బాటలో నడుస్తోంది.
గత మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా లక్ష కంటే ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాలని ప్రముఖ అమెరికన్ కొరియర్ కంపెనీ UPS భావిస్తోంది. క్రితం సంవత్సరం కంటే ఎక్కువ వేతనం చెల్లించడానికి సైతం నిర్ణయించుకుంది. హాలిడే సీజన్ రష్ లో సహాయం కోసం ఈ రిక్రూట్ మెంట్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ కోసం చూసే భారతీయ విద్యార్థులు సైతం లబ్ధి పొందనున్నారు.

టీమ్ స్టర్స్ యూనియన్‌తో ఐదేళ్ల కాలానికి గత నెలలో UPS తాత్కాలిక కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పార్ట్ టైమ్ మరియు ఫుల్ టైమ్ కార్మికులకు వేతనం సహా పలు ఇతర ప్రయోజనాలు లభించనున్నాయి. సీజనల్ ప్యాకేజీ డ్రైవర్‌లు గంటకు 23 డాలర్లు, ప్యాకేజీ నిర్వాహకులు 21 డాలర్ల వేతనం పొందనున్నారు.
తమ సంస్థలో కార్మికులకు వేతనం పెరిగినప్పటికీ, జాబ్ మార్కెట్ ఇబ్బందిగానే ఉన్నట్లు UPS గ్లోబల్ సోర్సింగ్, రిక్రూటింగ్ మరియు ఆన్‌బోర్డింగ్ డైరెక్టర్ మాట్ లావేరీ తెలిపారు. కార్మికులను రిక్రూట్ చేసుకోవడం ఎన్నో సవాళ్లతో, అనిశ్చితుల మధ్య కొనసాగుతోందన్నారు. అయితే ఈ పరిస్థితుల మధ్య కూడా USలోని పలు సంస్థలు గత నెలలో లక్షా 87 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
జీవన వ్యయం పెరుగుతుండటంతో శెలవుల్లో అదనపు ఉద్యోగాలు చేయడం కోసం ప్రజలు చూస్తున్నట్లు లావెరీ వెల్లడించారు. కానీ లైసెన్స్‌లు కలిగిన యువ డ్రైవర్ల కొరత తమను వేదిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఉబెర్ వంటి రైడ్ షేరింగ్ యాప్ ల వైపు మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు భావిస్తున్నామన్నారు. బలమైన ప్రజా రవాణా వ్యవస్థ కలిగి ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనూ ఇది కష్టతరంగా మారిందన్నారు.


Click it and Unblock the Notifications