UPI News: మన పొరుగు దేశంమాల్దీవుల్లో ఇటీవల కొలువుదీరిన మహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. చైనాకు దగ్గర జరగడమే కాకుండా ప్రధాని మోదీ సహా భారతీయులను తీవ్రంగా అవమానించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఇండియన్స్ మాల్దీవులకు టూర్స్ బాయ్‌కాట్ చేసి దాని ప్రధాన ఆర్థిక వనరుపై తీవ్రంగా దెబ్బకొట్టారు. దీన్ని భరించలేని ఆ సముద్ర దేశం కాళ్లబేరానికి వచ్చింది. ఈ వివాదం చెలరేగిన చాలా కాలం తర్వాత అక్కడ పర్యటిస్తున్న మన విదేశాంగ మంత్రి మాల్దీవులకు గుడ్ న్యూస్ చెప్పారు.
భారతీయుల నుంచి మాల్దీవులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ.. మన ప్రభుత్వం మాత్రం చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించేందుకు మొగ్గు చూపింది. అంతేకాకుండా ఆ దేశానికి ఇండియా చేస్తున్న సహాయాన్ని కూడా పెంచింది. ఇప్పుడు అక్కడ UPI సేవలను సైతం ప్రారంభించేందుకు చర్యలు మొదలుపెట్టింది. కేంద్రమంత్రి జైశంకర్ తాజా పర్యటనలో భాగంగా ఈ శీఘ్ర చెల్లింపుల వ్యవస్థను ఆ దేశంలో కూడా ప్రవేశ పెట్టేందుకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది.

'నేడు ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్స్ లో 40 శాతం భారత్ లోనే జరుగుతున్నాయి. ఈ వ్యవస్థ అందించిన ప్రతిఫలాలను భారతీయులు రోజూ అనుభవిస్తున్నారు. ఇవాళ ఒప్పందంపై సంతకంతో ఈ డిజిటల్ పేమెంట్స్ ఇన్నోవేషన్‌లో మాల్దీవుల ప్రజలు కూడా భాగస్వాములు కానున్నారు. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మా నైబర్‌హుడ్ ఫస్ట్, సాగర్ విజన్ లో మాల్దీవులు ముఖ్య భాగస్వామి' అని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ కొత్త చెల్లింపు వ్యవస్థ దేశ పర్యాటక రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలదని జయశంకర్ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల విదేశాంగ మంత్రితో కలిసి 'హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్' మరియు 'ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' క్రెడిట్ లైన్ కింద పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ పర్యటనతోనైనా ఇరుదేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడతాయని అక్కడి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications