దీపావళి సీజన్‌లో రోజుకు రూ. 96,000 కోట్ల UPI లావాదేవీలు రికార్డు స్థాయికి చేరాయి
దీపావళి సీజన్ ఈసారి కేవలం వెలుగులతోనే కాకుండా, డిజిటల్ లావాదేవీలతో కూడా ప్రకాశించింది! అక్టోబర్ నెలలో UPI రికార్డు స్థాయి వృద్ధి సాధించింది. పండుగల కొనుగోళ్లు, ఆఫర్లు, అలాగే కొత్తగా అమల్లోకి వచ్చిన GST 2.0 కారణంగా ప్రజలు పెద్దఎత్తున డిజిటల్ చెల్లింపులు చేశారు.
ఈ దీపావళి పండుగ సీజన్‌లో UPI వినియోగం నగరాలు, చిన్న పట్టణాలు, పల్లెలలోనూ గణనీయంగా పెరిగింది. పెద్ద నగరాల్లో మిలీనియల్స్, Gen Z పెద్ద ఎత్తున ఆన్‌లైన్ షాపింగ్, EMI ప్లాన్లు, QR కోడ్ చెల్లింపులు వంటి ఫీచర్ల కోసం UPI వాడుతున్నారు. పెద్ద వయసు గల సీనియర్ సిటిజెన్స్‌లు కూడా UPIని సులభమైన పద్ధతిలో బిల్లు చెల్లింపులు, రీచార్జ్‌లు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా పండుగల సందర్భంగా చిన్న వ్యాపారాలు, MSMEs UPI ద్వారా కస్టమర్ల నుంచి చెల్లింపులు స్వీకరించడం పెరిగింది. ఫలితంగా, చెల్లింపుల మొత్తం సంఖ్య రోజుకు 68 కోట్ల రేంజ్‌కి చేరింది.

NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, అక్టోబర్ 22 నాటికి రోజువారీ UPI లావాదేవీ విలువ రూ. 96,000 కోట్లు దాటింది. ఇది సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు 16% ఎక్కువ. లావాదేవీల సంఖ్య కూడా కొత్త రికార్డులు సృష్టించింది. రోజుకి సగటున 68 కోట్ల లావాదేవీలు జరిగాయి, ఇది గత నెలలోని 65 కోట్ల కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85% వాటా UPIకే చెందుతుంది.
దీపావళి అంటే కొనుగోళ్ల సీజన్! ఆన్‌లైన్ అయినా, షాపింగ్ మాల్ అయినా, ప్రతి చోటా వినియోగదారులు బాగా ఖర్చు చేశారు. అక్టోబర్ నెలలోనే ఆరు రోజుల పాటు రోజువారీ లావాదేవీలు రూ. 1 లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి. దీపావళి ముందు రోజు 74 కోట్ల లావాదేవీలు జరగడం ఒక్కదానితోనే ఎంత పెద్ద ఉత్సాహం ఉందో అర్థమవుతుంది. బిల్లులు చెల్లించడం నుండి గిఫ్ట్ కార్డులు, షాపింగ్ వరకు UPI ఈసారి ఫెస్టివల్ సీజన్‌లో ప్రధాన పాత్ర పోషించింది.
UPI వృద్ధిలో మరో ప్రధాన కారణం కొత్త GST 2.0 పద్ధతి ఈ కొత్త ట్యాక్స్ వ్యవస్థలో 12% మరియు 28% స్లాబ్‌లు తొలగించబడి, కేవలం 5% మరియు 18% రేట్లు మాత్రమే ఉంచారు. కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చినప్పటికీ, వాటి ప్రభావం అక్టోబర్‌లో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు కొత్త రేట్లు వచ్చాకే వస్తువులు కొనాలనుకుని, ఆ తర్వాత పెద్ద మొత్తంలో షాపింగ్ చేశారు. దాంతో పండుగ ఉత్సాహం + పన్ను తగ్గింపు కలయికతో UPI ట్రాన్సాక్షన్లు రికార్డులు బద్దలుకొట్టాయి. ఇలా కొనసాగితే, రాబోయే నెలల్లో UPI మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం!


Click it and Unblock the Notifications