ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్, యూజర్లు భయపడాల్సిన పని లేదు. దెబ్బ ఎవరికంటే..
దేశంలో అగ్రగామిలో దూసుకుపోతున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి కొత్త మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1 నుంచి యూపీఐలో కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఆటో-పే, బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక సేవలకు రూల్స్ మారబోతున్నాయి. చెల్లింపులు అధికంగా జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఎన్‌పీసీఐ ఈ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకువస్తోంది.
రోజులో కేవలం 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ : ఇప్పటి వరకు యూపీఐ యాప్‌ల (ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం) ద్వారా ఎన్ని సార్లైనా బ్యాలెన్స్ తనిఖీ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఆగస్టు 1 నుంచి రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనుమతిస్తారు. అలాగే ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ అయిన అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు చూడడానికి కూడా రోజుకు 25 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఈ పరిమితులు ఎందుకు ? యూపీఐ సేవల్లో పలుమార్లు సమస్యలు ఎదుర్కుంటున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈ కీలకమైన చర్యలు తీసుకుంది. అనవసర API కాల్స్ - అంటే పదేపదే బ్యాలెన్స్ చెక్ చేయడం, స్టేటస్ చూడడం వంటి అంశాలు నెట్‌వర్క్‌పై భారం పెంచుతున్నాయని NPCI గుర్తించింది. అందుకే వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలందించేందుకు ఈ పరిమితులను అమలు చేయనుంది.

ఆటోపేమెంట్లకు కొత్త షెడ్యూల్ నిబంధనలు : ఇకపై సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, బిల్లులు, ఈఎంఐ లాంటి ఆటోపేమెంట్ లావాదేవీలు వినియోగదారులు రద్దీ లేని సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయాలని NPCI సూచించింది. దీని ప్రకారం.. యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్‌లను రోజులో ట్రాఫిక్ తక్కువగా ఉన్న టైమ్‌లోనే షెడ్యూల్ చేయాలి. అయితే యూజర్లకు ఇందులో మినహాయింపు ఇచ్చింది. యూజర్ స్వయంగా చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ద్వారా వినియోగదారులపై ప్రభావం : యూపీఐ లావాదేవీలను అధిక మొత్తంలో ఉపయోగించే వినియోగదారులకు మాత్రమే ఈ కొత్తగా రాబోయే మార్పులు ప్రభావితం కావచ్చు. సాధారణంగా చాలా మంది రోజుకు 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేయరు. కాబట్టి ఈ పరిమితులు ఎక్కువ మందికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండదు.
కానీ పెద్ద సంఖ్యలో లావాదేవీలు చేసే వ్యాపారులు, ఫ్రీక్వెంట్ యూజర్లకు రానున్న కొత్త రూల్స్ కొంత మేర ప్రభావం చూపవచ్చు. ఈ మార్పులు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి అన్ని యూపీఐ యాప్‌లకు వర్తిస్తాయని NPCI స్పష్టం చేసింది. యూపీఐ ఆధారిత సేవలు అందించే ప్రతి యాప్, బ్యాంక్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఈ మార్గదర్శకాలను పాటించాలని కంపెనీ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications