RBI News: దేశంలో డిజిటల్ చెల్లింపులకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. భౌతికంగా డబ్బు వినియోగం నుంచి ప్రజలు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు మారుతున్నారు.

ఫిబ్రవరిలో రికార్డులు..
యూపీఐ చెల్లింపులు రోజుకు 36 కోట్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 2023లో రోజువారీ ట్రాన్సాక్షన్ల సంఖ్య 36 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. 2022 ఫిబ్రవరిలో యూపీఐ చెల్లింపుల సంఖ్య రోజుకు 24 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం అవి 50 శాతం మేర పెరిగాయి.

లావాదేవీల విలువ..
విలువ ప్రకారం రోజువారీ యూపీఐ చెల్లింపుల విలువ ఫిబ్రవరి 2023లో రూ.6.27 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో వీటి విలువ రూ.5.36 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో మొత్తం UPI లావాదేవీల సంఖ్య దాదాపు 800 కోట్లు దాటింది. ఫిబ్రవరి 28 నాటికి NEFT రోజువారీ లావాదేవీలు 3.18 కోట్లుగా నమోదయ్యాయి.

2017 నుంచి వృద్ధి..
యూపీఐ లావాదేవీల సంఖ్య 2017 జనవరిలో 0.45 కోట్లుగా నమోదు కాగా.. 2023 జనవరిలో వాటి సంఖ్య 804 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో లావాదేవీల విలువ రూ.17,000 కోట్ల నుంచి రూ.12.98 లక్షల కోట్లకు చేరుకుందని రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ చెల్లింపులను ఆమోదించే స్థలాల సంఖ్య 17 కోట్ల టచ్ పాయింట్ల నుంచి 26 కోట్ల టచ్ పాయింట్లకు పెరిగింది. అంటే 53% పెరుగుదల నమోదైందని తెలుస్తోంది.

శక్తికాంత దాస్ వ్యాఖ్యలు..
2022తో పోలిస్తే 2023లో UPI లావాదేవీలు 50% వృద్ధిని సాధించాయని రిజర్వు బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు. దేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ UPI.. రోజూ 100 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం కలిగి ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ను(UPI) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) 2016లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ప్రజలకు చేరువైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications