upi limit: దేశంలో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నా.. కరోనా అనంతరం వాటికి విపరీతంగా ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. గతంలో ఎవరికైనా డబ్బు పంపించాలంటే బ్యాంకు వద్ద గంటల తరబడి లైన్ లో నిలబడాల్సి వచ్చేది. దుకాణాల వద్ద చెల్లింపుల కోసమైతే ఖచ్చితంగా నగదు తీసుకెళ్లాల్సిందే.. చిల్లర కోసం నానా తంటాలు పడాల్సిందే. వీటన్నిటికీ చెక్ పెడుతూ.. UPI ద్వారా వేగవంతమైన చెల్లింపు వ్యవస్థను ప్రభుత్వం తీసుకువచ్చింది. PhonePe, Gpay, Amazon Pay, Paytm వినియోగం ద్వారా ఇది మరింత పాపులర్ అయింది.

లావాదేవీలపై పరిమితులు:
UPI ద్వారా చేసే చెల్లింపులు, నగదు బదిలీలపై RBI పరిమితి విధించింది. అంటే ఒక రోజులో.. బ్యాంకులు నిర్ణయించిన మొత్తాన్ని మాత్రమే UPI ద్వారా వినియోగించుకోవచ్చన్న మాట. ఇంకా ఎక్కువ ఖర్ఛు చేయాలంటే మరుసటి రోజు వరకు వేచి చూడాలి లేదా నగదు చెల్లింపులే గతి. ఈ పరిమితి చెల్లింపులు మరియు స్వీకరణలు రెండింటికీ వర్తిస్తుంది. బ్యాంకును బట్టి పరిమితి మారుతూ ఉంటుందని గమనించాలి. UPI చెల్లింపులకుగాను ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇరవై లావాదేవీలకే అనుమతి:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్గదర్శకాల ప్రకారం.. UPI ద్వారా రోజుకి లక్ష రూపాయల వరకు లావాదేవీలు చేయవచ్చు. కెనరా బ్యాంక్‌లో రోజువారీ పరిమితి 25 వేలు కాగా.. SBIలో రోజువారీ పరిమితితో పాటు బదిలీల సంఖ్యపై కూడా ఆంక్షలు ఉన్నాయి. కేవలం 20 లావాదేవీల వరకు మాత్రమే అనుమతిస్తుండగా.. పరిమితి ముగిసిన తర్వాత పునరుద్ధరణ కోసం 24 గంటలు వేచి చూడాల్సిందే.

డిజిటల్ వాలెట్లలో ఇలా..
Paytm UPI ద్వారా రోజుకు లక్ష రూపాయలు బదిలీ చేయవచ్చు. ఒక గంటలో 20 వేలు మాత్రమే వినియోగించేలా పరిమితి విధించింది. తద్వారా గంటకు 5 లావాదేవీలు, రోజుకు 20 జరపడానికి అనుమతిస్తోంది. PhonePay, GPay, AmazonPay కు సైతం రోజుకు లక్ష పరిమితి ఉండగా.. రోజులో గరిష్టంగా 20 లావాదేవీలు నిర్వహించవచ్చు. గంటల వారీగా అయితే పరిమితేమీ లేదు. AmazonPayలో నమోదు చేసుకున్న మొదటి 24 గంటల్లో వినియోగదారులు 5 వేల వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరు. బ్యాంకును బట్టి రోజుకు 20 లావాదేవీలు జరపడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications