UPI: గ్రీస్ లో అందుబాటులోకి వచ్చిన యూపీఐ సేవలు..!
భారత్ లో వచ్చిన యూపీఐ విప్లవం ప్రపంచవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో యూపీఐ అందుబాటులోకి వచ్చింది. తాజాగా యూపీఐ గ్రీస్ లో కూడా యూపీఐ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి కేంద్ర పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. ఇప్పుడు గ్రీస్‌లో యూపీఐ అందుబాటులోకి రావడంతో, అర్హులైన వినియోగదారులు తక్షణమే, సురక్షితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా డబ్బును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. గ్రీస్‌లో ఇప్పుడు ప్రవేశపెట్టిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ, పర్యాటకులుగా ఆ దేశాన్ని సందర్శించే భారతీయులతో సహా అర్హులైన వినియోగదారులను యూపీఐ ద్వారా తక్షణమే డబ్బు పంపడానికి అవకాశం ఉంది.
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్త విస్తరణలో ఇది మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐకి ప్రపంచవ్యాప్తంగా ఆధారణ పెరుగుతుందని అన్నారు. ఇది భారతదేశ సాంకేతికత ఆధారిత ఆర్థిక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శమని తెలిపారు. గ్రీస్ కు వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులు అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆధారపడకుండా యూపీఐ ఎనేబుల్డ్ మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించుకోవచ్చు. గ్రీస్ లో యూపీఐ అందుబాటులోకి రావడం వల్ల అనేక లాభాలు ఉండనున్నాయి. అంతర్జాతీయ డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపితే అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి. ఇప్పుడు యూపీఐతో ఆ ఖర్చులు తగ్గనున్నాయి.

అలాగే నగదును పెద్ద మొత్తంలో వెంట తీసుకెళ్లకుండా యూపీఐ ద్వార చెల్లింపు చేయవచ్చు. యూపీఐ ద్వారా వేగంగా చెల్లింపులు చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ సేవలను సింగపూర్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, నేపాల్, భూటాన్, ఖాతార్, శ్రీలంక, కాంబోడియాలో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో యూపీఐ సేవలు 2016 ఏప్రిల్ లో అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు 21 బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐని తీసుకొచ్చారు. మొదటి సంవత్సరంలో కేవలం 44 బ్యాంకులు మాత్రమే యూపీఐని అనుమతించాయి.
కానీ ఆ తర్వాత అన్ని బ్యాంకులు యూపీఐ అనుమతించాయి. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు రెండూ ఒకే మౌలిక సదుపాయాలపై అప్లికేషన్లను రూపొందించుకోవడానికి వీలు కలిగింది. ఇందులో భాగంగానే గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్ లు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో రికార్డ్ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా తమ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి భారత్ తో కలిసి పని చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications