UPI వినియోగదారులకు షాక్.. రూ. 2 వేలకు పైన ట్రాన్సాక్షన్ చేస్తే ఛార్జీలు.. ప్రతిపాదిత చట్ట మార్పులో ఏముందంటే..
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సుస్థిరంగా మార్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఎంపిక చేసిన కొన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులపై.. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అని పిలిచే సేవా ఛార్జీలను విధించేందుకు వీలుగా చట్టపరమైన సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
దీనికి సంబంధించిన టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్, 2026ను ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 నిబంధనలను సవరించడం ద్వారా.. బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లు ఎటువంటి ఛార్జీలు విధించకుండా అడ్డుకుంటున్న ప్రస్తుత చట్టపరమైన పరిమితులను తొలగించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రతిపాదిత చట్టానికి ఆమోదం లభిస్తే.. పెద్ద వ్యాపార సంస్థలకు చేసే రూ. 2 వేలు పైబడిన అధిక విలువ గల యూపీఐ లావాదేవీలపై మొదటి దశలో మర్చంట్ ఛార్జీలను విధించే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జీలను కేవలం వ్యాపారుల (మర్చంట్లు) పైనే విధిస్తారు తప్ప.. సాధారణ వినియోగదారుల (కస్టమర్ల) పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టమవుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంచనాల ప్రకారం.. రూ. 2 వేలు కనీస పరిమితి అనేది మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో కేవలం 5 శాతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కానీ, విలువ పరంగా చూస్తే ఇవి మొత్తం చెల్లింపుల విలువలో ఏకంగా 65 శాతంగా ఉండటం గమనార్హం.
ఈ నూతన ప్రతిపాదన అమలులోకి వచ్చినా.. సామాన్య ప్రజల రోజువారీ లావాదేవీలపై ఎలాంటి భారం పడదు. పాలు, కూరగాయలు, చిన్న కిరాణా సామాగ్రి కొనుగోళ్లు, ఆటో లేదా టాక్సీ ప్రయాణాలకు చేసే తక్కువ విలువ గల చెల్లింపులకు ఈ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. కాబట్టి చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. ఒక్క జూలై నెలలోనే యూపీఐ ద్వారా రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 23.66 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఈ రికార్డు స్థాయి వినియోగం యూపీఐ వ్యవస్థ ప్రాధాన్యతను చాటుతోంది.
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన అమలుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన కాలపరిమితి, తుది నిర్ణయం లేదా కార్యాచరణ ప్రణాళిక ఖరారు కాలేదని సమాచారం. అయినప్పటికీ ఈ చట్ట సవరణ ద్వారా ఎంపిక చేసిన లావాదేవీలపై ఎమ్‌డిఆర్‌ను తిరిగి ప్రవేశపెట్టడానికి అవసరమైన ఒక స్పష్టమైన చట్టపరమైన చట్రం ఏర్పడుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. చెల్లింపుల మౌలిక సదుపాయాల నిర్వహణ, సైబర్ భద్రత, డిజిటల్ వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక సుస్థిరత కోసం చార్జీలను అనుమతించాలని ఫిన్‌టెక్ రంగానికి చెందిన చెల్లింపుల పరిశ్రమ చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నిర్ణయం అమలైతే డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక పెద్ద విప్లవాత్మక మార్పుకు నాంది కానుంది.


Click it and Unblock the Notifications
