సాధారణంగా డబ్బు అంటే ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ కంటే నిజాయితీనే గొప్పదని ఒక మహిళ రుజువు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన ఒక మహిళ బ్యాంక్ అకౌంట్ లో పొరపాటున ఏకంగా రూ. 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబం, స్క్రీన్ మీద కనిపిస్తున్న అంకెలను చూసి కళ్లు తేలేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ (trending) లో ఉంది.

ఏటీఎం స్క్రీన్ చూసి గుండె ఆగినంత పనైంది
మెయిన్‌పురి జిల్లాకు చెందిన సీత అనే మహిళకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఆమె కుమారుడు అరుణ్ కుమార్.. ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి , బ్యాలెన్స్ చెక్ చేయడానికి బ్యాంకుకు వెళ్ళాడు. అక్కడ స్లిప్ తీసి చూడగా.. అకౌంట్‌లో ఏకంగా రూ. 9,99,49,586 (దాదాపు పది కోట్లు) ఉన్నట్లు చూపించింది. అంత పెద్ద మొత్తాన్ని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.
మాకు రూపాయి కూడా వద్దు.. తిరిగి తీసుకోండి!
ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం సంబరపడలేదు, సరే కదా భయాందోళనకు గురైంది. తమది వ్యవసాయం మీద ఆధారపడే సామాన్య కుటుంబమని, ఇంత డబ్బు తమకు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదని వారు వాపోతున్నారు. ఆ మహిళ సీత మాట్లాడుతూ.. "మాకు ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎవరిదో వాళ్లే వెనక్కి తీసుకోవాలి" అని నిజాయితీగా పేర్కొన్నారు. ఆమె భర్త ఫర్జాన్ కూడా స్పందిస్తూ, బ్యాంక్ తెరవగానే వెళ్లి ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. వారి నిబద్ధత చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బ్యాంకు అధికారులు ఏమంటున్నారు?
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా సుల్తాన్‌గంజ్ బ్రాంచ్ అధికారులు స్పందించారు. ఇదంతా ఒక 'టెక్నికల్ ఎర్రర్' (సాంకేతిక లోపం) వల్ల జరిగి ఉండవచ్చని వారు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ మహిళకు గతంలో లోన్ అకౌంట్ ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని, ఆమె నేరుగా బ్యాంకుకు వచ్చి ఉంటే సమస్య ముందే పరిష్కారం అయ్యేదని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి బ్యాంకింగ్ పొరపాట్లు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక సామాన్య కుటుంబం పది కోట్లు వచ్చినా ఆశపడకుండా తిరిగి ఇచ్చేయాలని అనుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం.


Click it and Unblock the Notifications