2021లో 11% పెరిగిన పెట్రోల్ ధరలు, న్యూయార్క్‌తో పోలిస్తే ముంబైలో డబుల్ ధరలు!
వరుసగా రెండు రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన అనంతరం నేడు (బుధవారం, జూన్ 2) స్థిరంగా ఉన్నాయి. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డును తాకాయి. నిన్న పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 23 పైసలు పెరిగింది. నిన్నటి పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ పైన రూ.94.49, డీజిల్ లీటర్ రూ.85.38గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. పెట్రోల్ రూ.100.72, డీజిల్ రూ.92.69కు చేరుకుంది. మే 4వ తేదీ నుండి ఇది 17వ పెంపు. పెట్రోల్ పైన రూ.4.09, డీజిల్ పైన రూ.4.65 పెరిగింది. రాజస్థాన్ లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.105.52కు చేరుకుంది. గ్యాసోలైన్ ధరలు ముంబైలో రూ.100 దాటింది. తద్వారా న్యూయార్క్ నగరంలో కంటే ఇక్కడే ఖరీదుగా మారింది.

న్యూయార్క్‌తో పోలిస్తే రెండింతలు!
పెట్రోల్ ధరలు 2021 సంవత్సరంలో 11 శాతం మేర పెరిగాయి. అమెరికా ఆర్థిక కేంద్రంగా న్యూయార్క్‌ను పేర్కొంటారు. భారత ఆర్థిక రాజధాని ముంబై. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైగా ఉండగా, న్యూయార్క్‌లో 0.79 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.57. న్యూయార్క్ స్టేట్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం అక్కడ 0.79 డాలర్లుగా ఉంది. ముంబై నగరంలో న్యూయార్క్‌తో పోలిస్తే దాదాపు రెండింతలుగా ఉంది.

ముడో అతిపెద్ద దిగుమతిదారు
పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు గత ఎనిమిదేళ్ల కాలంలో 60 శాతం మేర పెరిగాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటాలు కలుపుకుంటే దాదాపు సగానికి పైగా పన్నులు ఉంటాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ దిగుమతిదారు భారత్. కరోనా సెకండ్ వేవ్, ఆంక్షల నేపథ్యంలో మే నెలలో ఇంధన డిమాండ్ తగ్గింది. ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయని చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి.

పన్నులు పెరిగాయిలా..
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. 2019 జనవరి నెలలో పెట్రోల్ ధర లీటర్ రూ.68.65గా ఉంది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు బ్యారెల్‌కు 59.27గా ఉంది. గత ఏడాది కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 20 డాలర్ల స్థాయికి పడిపోయాయి.
దేశీయంగా పన్నులు పెంచడంతో ఇక్కడ ధరలు తగ్గలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 2019 జనవరి స్థాయికి చేరుకున్నాయి. కరోనా సమయంలో పన్నులు పెంచడంతో దేశీయంగా అప్పుడు ఉన్న ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 2019 జనవరిలో బ్యారెల్ ఇంధనం 59.27 డాలర్లు కాగా, ప్రస్తుతం 67.05 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో అప్పుడు పెట్రోల్ లీటర్ రూ.68.55 కాగా, ఇప్పుడు రూ.93కు పైన ఉంది.


Click it and Unblock the Notifications