Nitin Gadkari: గ్రీన్ ఇంధనం దిశగా భారత్ ప్రయాణిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, CNG, హైడ్రోజన్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విద్యుత్ ఆధారిత వాహనాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లే కనిపిస్తోంది. కాగా ఈ సమయంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చేందుకు పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే పూర్తిగా వాటిని వినియోగం నుంంచి తప్పించం సాధ్యమేనా అనే ప్రశ్న మీడియా నుంచి ఆయనకు ఎదురైంది. ఆయన ఏమాత్రం సంకోచించకుడా 'వంద శాతం. ఇది కష్టం కానీ అసాధ్యం కాదు అని భావిస్తున్నాను' అని సమాధానం ఇచ్చారు.

ఇంధన దిగుమతుల కోసం భారత్ ఏటా 16 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. పూర్తిగా గ్రీన్ ఇంధనానికి మారగలిగితే ఈ డబ్బును రైతుల జీవితాల మెరుగుదలకు ఉపయోగించవచ్చని గడ్కరీ అభిప్రాయపడ్డారు. తద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, యువతకు ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.
హైబ్రిడ్ వాహనాలపై GSTని 5 శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్‌లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని మంత్రి వెల్లడించారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఇంధన దిగుమతులను నిలిపివేయవచ్చని చెప్పారు. 2004 నుంచి తాను ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం ప్రయత్నిస్తున్నానని, రానున్న ఏడేళ్లలో పరిస్థితులు మారతాయన్న నమ్మకం ఉందన్నారు.
'ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్న వేగాన్ని బట్టి అతి త్వరలోనే ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కల నెరవేరుతుందని గట్టిగా నమ్ముతున్నాను. నేను హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లను చూడవచ్చు. ఒకప్పుడు ఇది అసాధ్యమని చెప్పేవారు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. గత 20 ఏళ్లుగా నేను చెబుతున్న వాటిని నమ్మడం ప్రారంభించారు' అని చెప్పారు.


Click it and Unblock the Notifications