No Custom Duty: అరుదైన వ్యాధులతో బాధపడే రోగులకు కేంద్రం తాజా నోటిఫికేషన్ పెద్ద ఊరటను అందించనుంది. జాతీయ విధానం 2021 కింద జాబితా చేయబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం దిగుమతిచేసుకునే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపును ప్రకటించింది.
కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుడు శశి థరూర్ సిఫారసు మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి.. నిహారిక అనే చిన్నారికి అరుదైన క్యాన్సర్ మందు కోసం ఇమ్యునోథెరపీ డ్రగ్‌పై రూ.7 లక్షల విలువైన కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును అనుమతించిన తర్వాత తాజా ప్రకటన వచ్చింది. అయితే ఈ మినహాయింపు పొందటానికి ప్రభుత్వం లేదా వ్యక్తిగత దిగుమతిదారులు కేంద్ర లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ లేదా జిల్లా మెడికల్ ఆఫీసర్ లేదా జిల్లాలోని సివిల్ సర్జన్ నుంచి సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 10 శాతంగా ఉంది. అయితే కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లేదా వ్యాక్సిన్స్ విషయంలో రేటును కేంద్రం 5 శాతానికి పరిమితం చేసింది. వెన్నెముక కండరాల క్షీణత లేదా డుచెన్ కండరాల బలహీనత చికిత్స కోసం వినియోగించే మందులు, ఆహారాలు ఖరీదైనవి. పైగా వీటిని అధికశాతం దిగిమతి చేసుకోవలసి ఉంటున్నందున కేంద్ర ప్రభుత్వం వారికి ఊరటన కల్పించే సదుద్ధేశంతో సుంకం విషయంలో తాజా ప్రకటన చేసింది.
వివిధ క్యాన్సర్‌ల చికిత్సలో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్ ను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 10 కిలోల బరువున్న పిల్లలకు, కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు ఔషధాల మోతాదును బట్టి ఏడాదికి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి కంటే ఎక్కువ చికిత్సకు ఖర్చవుతుంది. తాజాగా ప్రకటించిన మినహాయింపు వల్ల రోగులకు చాలా ఖర్చు తగ్గుతుందని, ఇది వారికి పెద్ద ఉపశమనాన్ని అందించటంలో తోడ్పడుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications