అమ్మకానికి డిఫెన్ స్టాక్ వాటాలు.. కేంద్రం నిర్ణయంతో నష్టాల్లో షేర్.. 2020 తర్వాత..!!
HAL Shares OFS: భారత అమ్ములపొదిలో అవసరమైన ఆయుధాలను అందించే సంస్థలు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తుంటాయి. వీటిలో అధిక శాతం వాటాలను ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా హెచ్ఏఎల్ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
దేశంలోని ప్రఖ్యాత ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 3.5 శాతం వరకు వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటాల విక్రయాల విలువ దాదాపు రూ.2,867 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి ముందు 2020లో కూడా భారత ప్రభుత్వం ఈ సంస్థలోని కొంత భాగాన్ని విక్రయించింది. తాజా వాటాల విక్రయాలు ప్రభుత్వ రంగం సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా జరుగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

హెచ్ఏఎల్ మార్చి 22న స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్ లో వెల్లడించిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక్కో షేరును రూ.2,450 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ట్రేడవుతున్న ధర కంటే దాదాపు 6.6 శాతం తక్కువని తెలుస్తోంది. మార్చి 22న డిఫెన్స్ స్టాక్ బీఎస్ఈలో 1.02 శాతం మేర తగ్గి రూ.2,623 వద్ద ముగిసింది. ఉదయం 11.09 గంటల సమయంలో 5 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ధర రూ.2,489 వద్ద కొనసాగుతోంది.
ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియ ద్వారా కేంద్రం కలిగి ఉన్న మెుత్తం వాలాలో 1.75 శాతం రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన షేర్లను విక్రయించనుంది. అయితే వీటిని నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు అమ్మనుంది. ఒకవేళ మంచి స్పందన వచ్చి ఓఎఫ్ఎస్ ఓవర్ సబ్ స్క్రైబ్ అయినట్లయితే మరో 1.75 శాతాన్ని విక్రయించే ఆలోచనను పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ముందు 2020లో కంపెనీలోని 15 శాతం వాటాలను ఒక్కో షేరు రూ.1,001కి విక్రయించటం ద్వారా రూ.5,000 కోట్లను అప్పట్లో సమీకరించింది.
స్వాతంత్య్రానికి ముందు డిసెంబర్ 23, 1940లో ప్రారంభించిన ప్రభుత్వ రంగంలోని సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ సంస్థలో భారత ప్రభుత్వానికి అత్యధికంగా 75 శాతం వరకు వాటా ఉంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇది ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీదారుల్లో ఒకటిగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications