Cigarettes: సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కేంద్రం రూల్స్ తో నష్టపోయే 5 స్టాక్స్ ఇవే..!
Cigarettes: పొగతాగే అలవాటు ఉన్న వారిని మార్చటం నిజంగా చాలా కష్టం. అయితే ఇకపై వారికి షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ద్వారా వినియోగదారులతో పాటు సిగరెట్ తయారీ కంపెనీలకూ ప్రభావం ఉండనుంది.

త్వరలో నిషేధం..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశానికి ముందుగానే వ్యక్తిగత సిగరెట్ల అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు లూజ్ సిగరెట్ల విక్రయాలపై బ్యాన్ విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు లూజ్ సిగరెట్ల విక్రయం దెబ్బతీస్తోందని కమిటీ తన సిఫారసులో వెల్లడించింది. అందుకే విడిగా సిగరెట్లను అమ్మటాన్ని నిషేధించాలని కోరింది.

విమానాశ్రయాలు..
ఇది మాత్రమే కాకుండా.. ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో స్మోకింగ్ జోన్‌ను ఉపయోగించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫారసులపై చర్యలు తీసుకుంటూ త్వరలోనే దేశంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మూడేళ్ల కిందట దేశంలో ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని కేంద్రం నిషేధించింది. దీనికి తోడు జీఎస్టీ అమలులోకి వచ్చినా పొగాకు ఉత్పత్తులపై పన్నును పెద్దగా పెంచలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎత్తి చూపింది.

ప్రస్తుతం పన్నులు..
దేశంలో ప్రస్తుతం పన్నుల వివరాల ప్రకారం బీడీలపై 22%, సిగరెట్లపై 53%, పొగలేని పొగాకుపై 64% GST పన్ను విధించబడుతోంది. పొగాకు ఉత్పత్తులపై 75 శాతం జీఎస్టీ విధించాలని డబ్ల్యూహెచ్‌ఓ భారత ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. వీటి వల్ల ఏటా 3.5 లక్షల మంది దేశంలో చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం 46% మంది పొగత్రాగేవారిలో నిరక్షరాస్యులు, 16% మంది కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై రూ.200 జరిమానా విధిస్తోంది.

బడ్జెట్ సమయంలో..
బడ్జెట్ తయారీ కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల సమావేశాలను నిర్వహిస్తుండగా, అవసరమైన డేటాను అందించిన తర్వాత బడ్జెట్ తయారీకి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది. ఈ క్రమంలో లూజ్ సిగరెట్ అమ్మకాలపై నిషేధం ప్రకటన బడ్జెట్ ప్రకటనకు ముందే విడుదల చేయాలని భావిస్తున్నారు.

భారీగా నష్టపోనున్న స్టాక్..
కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తే ఎక్కువగా నష్టపోయే కంపెనీల జాబితాలో ముందువరుసలో ఉండేది ఐటీసీ స్టాక్. ఐటీసీ సిగరెట్ల తయారీ, విక్రయంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ. ఇది మంచి డివిడెండ్ స్టాక్ కూడా. చాలా మంది ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులను కలిగి ఉన్నారు. దీనికి తోడు గోల్డెన్ టొబ్యాకో లిమిటెడ్, ఎన్టీసీ ఇండస్ట్రీస్, విఎస్టీ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫ్రే ఫిలిప్స్ కంపెనీల షేర్లు సైతం భారీగా నష్టపోనున్నాయి.


Click it and Unblock the Notifications