Windfall Tax: ఒకపక్క అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు కుతకుతలాడుతుంటే.. కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి ఊరటను కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
దేశంలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం టన్నుకు రూ.9,050కి తగ్గించింది. గతంలో ఈ పన్ను టన్నుకు రూ.12,100గా ఉండేది. ఇదే క్రమంలో డీజిల్ ఎగుమతిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం(SAED) లీటరుకు 4 రూపాయలకు తగ్గించబడింది. గతంలో ఇది లీటరుకు రూ.5గా ఉండేది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపులు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. అదేవిధంగా విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.2.5 నుంచి రూ.1కి విండ్‌ఫాల్ పన్నును తగ్గిస్తున్నట్లు తాజా సమీక్షలో వెల్లడించింది. ఇదే సమయంలో పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం మునుపటిలా సున్నాగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారిగా జూలై 1, 2022న ఈ పెట్రోలియం ఉత్పత్తులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధించబడింది. కంపెనీలు రిఫైనింగ్ లాభాల కోసం దేశీయంగా ఇంధనాన్ని ఎగుమతి చేయకుండా నిరోధించేందుకు ఈ పన్నును ప్రవేశపెట్టడం జరిగింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్యప్రాచ్య పర్యటనకు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ క్రమంలో బ్రెంట్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 1.71 శాతం పెరిగి 91.44 డాలర్లకు చేరుకోగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.39 డాలర్లకు చేరుకుంది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో అక్టోబర్ 19న ముగిసే క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మంగళవారం నాడు ప్రతి బిబిఎల్‌కి రూ.7,188 వద్ద ఉన్నాయి.
తాజాగా కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించటం దేశంలోని కొన్ని రిఫైనింగ్ కంపెనీలకు పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఈ వరుసలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, ఆయిల్ ఇండియాతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నేడు మార్కెట్లో లాభపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications