Ola-Uber కంపెనీలకు కేంద్రం నోటీసులు.. వేర్వేరు రేట్లపై సీరియస్, మీకూ ఇలా జరిగిందా?
Ola-Uber Notices: చాలా కాలంగా దేశంలోని పెద్ద క్యాబ్ అగ్రిగేటర్లుగా ఉన్న ఓలా, ఉబెర్ వంటి సంస్థల తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారులకు వారు ఉపయోగించే మెుబైల్ ఆధారంగా ఛార్జీల్లో వ్యత్యాసంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల వినియోగదారుల నుంచి వస్తున్న ఆరోపణలపై స్పందించింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఒకే దూరానికి వేరువేరు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు వచ్చిన కంప్లెయింట్లపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే ఐఫోన్, యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అసలు ఎందుకు వేరువేరు ధరలు చూపిస్తున్నాయో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రాథమిక పసిశోధనల్లో కూడా నిజంగా ఇది జరుగుతున్నట్లు గుర్తించబడింది.

అలాగే వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫోన్ మోడల్ వాటి ధర, బుక్కింగ్ కోసం వెళ్లినప్పుడు సదరు యూజర్ మెుబైల్ ఛార్జింగ్ వంటి వివిధ అంశాల ఆధారంగా ధరలు మారుతున్నట్లు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలకు దిగింది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకురావాలని స్పష్టం చేసింది. అసలు ఒకటే సర్వీసుకు వేరువేరు ధరలను ఎలా నిర్ణయిస్తున్నారో సరైన సమాధానం అందించాల్సిందేనని నోటీసుల్లో కోరింది.
ఇటీవల రిషబ్ సింగ్ అనే దిల్లీ వాసికి ఇదే తరహా అనుభవం ఎదురైనట్లు తేలింది. తాను ఉబెర్ యాప్ వినియోగించిన సమయంలో ఫోన్ మోడల్ బట్టి మాత్రమే కాకుండా అందులోని ఛార్జింగ్ బట్టి కూడా రేట్ల విషయంలో వ్యత్యాసాన్ని గమనించినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనికి రుజువుగా ఒకే సమయంలో రెండు వేరువేరు మెుబైల్ ఫోన్లలో ఒకే దూరానికి రైడ్ బుక్ చేయగా ఈ తేడాలను గమనించినట్లు అందులో వెల్లడించాడు. కంపెనీలు యాప్లలో బ్లాక్ స్పాట్స్ ద్వారా వినియోగదారులను ఇలా మోసం చేస్తుంటాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు ఎందుకిలా జరుగుతుందనే విషయంపై ఓలా-ఉబెర్ వివరణ ఇచ్చేవరకు అసలు విషయాలు బయటకు రావు.
క్యాబ్ అగ్రిగేటర్లకు నోటీసుల విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా తన ట్విట్టర్ ఖాతా వేధికగా ధృవీకరించారు. వివిధ మోడల్ మెుబైల్స్‌లో ఒకే సేవకు వేర్వేరు ఛార్జీలను చూపుతున్నందున ఓలా-ఉబెర్ నుంచి దీనిపై వివరణాత్మక సమాధానం కోరిందని ఆయన వెల్లడించారు. చాలా కాలంగా ఈ సమస్యను వినియోగదారులు ఎదుర్కొంటున్నప్పటికీ యూజర్ల ఆందోళనలపై కంపెనీలు స్పందించకపోవటం, సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చూస్తుంటే ఇది కావాలని చేస్తున్న పనిగా కనిపిస్తోందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా కంపెనీలు ఇలాంటి అక్రమ పద్ధతులను మానుకోవాలని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications