భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ పటంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. టెక్నాలజీ రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లుగా.. రాబోయే రోజుల్లో భారత్ కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే కాకుండా ప్రపంచానికి 'డిజిటల్ బ్యాక్‌బోన్'గా మారబోతోంది.

డేటా సెంటర్లకు 2047 వరకు 'టాక్స్ హాలిడే'
బడ్జెట్ 2026లో అత్యంత కీలకమైన అంశం డేటా సెంటర్స్ (Data centers) కు ప్రకటించిన పన్ను రాయితీలు. విదేశీ కంపెనీలు మన దేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందిస్తే.. వారికి 2047వ సంవత్సరం వరకు 'టాక్స్ హాలిడే' ప్రకటించారు. అంటే దాదాపు 21 ఏళ్ల పాటు పన్నుల నుండి భారీ వెసులుబాటు లభిస్తుంది.
దీని వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టనున్నాయి. ఇప్పటికే మన దేశంలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు డేటా సెంటర్ల రంగంలో కొనసాగుతుండగా.. కొత్తగా మరో 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. భవిష్యత్తులో ఈ మొత్తం 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0 ప్రారంభం
సెమీకండక్టర్ రంగంలో భారత్ ను స్వయంసమృద్ధం చేసేందుకు ప్రభుత్వం 'ISM 2.0' ను ప్రారంభించింది. దీని కోసం బడ్జెట్ లో ఏకంగా రూ. 40,000 కోట్లను కేటాయించారు. ఇది వరకు ఉన్న కేటాయింపులను దాదాపు రెట్టింపు చేయడం విశేషం.
- చిప్ తయారీ: కేవలం అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా.. చిప్ డిజైన్, తయారీ పరికరాలను (Equipment) కూడా భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి సారించారు.
- శిక్షణ: 1,000 కోట్ల రూపాయలతో పరిశ్రమల నేతృత్వంలో రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వేలాది మంది యువతకు సెమీకండక్టర్ రంగంలో హై-టెక్ ఉద్యోగాలు లభిస్తాయి.
- రాష్ట్రాల భాగస్వామ్యం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సెమీకండక్టర్ క్లస్టర్లను , కెమికల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా అత్యాధునిక డేటా సెంటర్స్ (Data centers) ఏర్పాటు చేసేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
ఏఐ డేటా సెంటర్లు ఎందుకు ముఖ్యం?
నేడు మనం వాడుతున్న చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్ పనిచేయాలంటే వెనుక శక్తివంతమైన కంప్యూటింగ్ పవర్ అవసరం. ఈ పవర్ అంతా డేటా సెంటర్స్ (Data centers) నుండే వస్తుంది. ఇండియాలో సొంతంగా ఏఐ డేటా సెంటర్లు ఉండటం వల్ల మన డేటా మన దేశంలోనే సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా స్థానిక స్టార్టప్‌లకు తక్కువ ధరకే ఏఐ క్లౌడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఐటీ , సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి పన్ను భారం తగ్గించేలా 'సేఫ్ హార్బర్' నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఐటీ సేవల ఎగుమతుల పరిమితిని రూ. 300 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు పెంచడం వల్ల మధ్యతరహా కంపెనీలకు ఊరట లభిస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ (ECMS) పథకానికి నిధులను రూ. 40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారడం ఖాయం.


Click it and Unblock the Notifications