బడ్జెట్ 2026లో ఆటో రంగం దారెటు..ఈవీ వాహనాలపై మోదీ సర్కారు వ్యూహం ఫలిస్తుందా..
ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026 ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి సృష్టి, ద్రవ్యోల్బణ నియంత్రణ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం కూడా బడ్జెట్ 2026పై భారీ ఆశలతో ఎదురుచూస్తోంది.
భారత ఆటో రంగం ప్రస్తుతం ఒక కీలకమైన మార్పు దశలో ఉంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మార్పును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ విధానాల స్థిరత్వం అత్యంత అవసరమని ఆటో కంపెనీలు భావిస్తున్నాయి.

తరచూ పాలసీలలో మార్పులు జరిగితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కష్టమవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఒక కొత్త వాహనం లేదా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అందువల్ల Budget 2026లో ప్రభుత్వం దీర్ఘకాలికంగా అమలయ్యే స్పష్టమైన ఆటో పాలసీ రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తుందని ఈ రంగం ఆశిస్తోంది.
ఇక పెట్టుబడుల విషయానికి వస్తే.. ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌పై భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధన, అభివృద్ధి (R&D)పై పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఆటో పరిశ్రమ కోరుతోంది. అలాగే కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులను శిక్షణ ఇవ్వడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని ఆశిస్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ తయారీని చౌకగా.. పోటీగా మార్చే దిశగా Budget 2026 కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తికి అడ్డంకిగా ఉన్న ప్రధాన అంశం ధర. లిథియం, బ్యాటరీ సెల్స్, ఇతర కీలక ముడి పదార్థాలపై ఉన్న అధిక దిగుమతి సుంకాలు వాహనాల ధరను పెంచుతున్నాయి. కాబట్టి ఈ అంశాలపై సుంకాలను తగ్గిస్తే.. EVల ధరలు తగ్గి వినియోగదారులకు నేరుగా లాభం చేకూరుతుందని ఆటో రంగం భావిస్తోంది. ఇది EVలను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేస్తుంది.
మరోవైపు, పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా విస్మరించలేమన్నది పరిశ్రమ వాస్తవం. బడ్జెట్ 2026లో వాహన రుణాలపై పన్ను ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ఫీజులలో మినహాయింపులు వంటి చర్యలు తీసుకుంటే వాహనాల డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులను తగ్గించి, వాటి ధరలను సంప్రదాయ వాహనాలకు దగ్గరగా తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది.
ఏదేమైనా బడ్జెట్ 2026లో తీసుకునే నిర్ణయాలు ఆటో రంగానికి కీలక మలుపుగా మారే అవకాశాలు ఉన్నాయి. విధాన స్థిరత్వం, పన్ను ఊరట, తయారీ ప్రోత్సాహం, EVలకు మద్దతు లభిస్తే, భారత ఆటో పరిశ్రమ కొత్త వేగంతో ముందుకు సాగుతుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications